యాప్‌లతో అవస్థలు
పనిచేయని ఫెర్టిలైజర్ యాప్..
యూరియా కొనుగోళ్లకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అవగాహన లేకపోవటంతో రైతుల పాట్లు
బూర్గంపాడు: పంటల సాగులో సాంకేతిక పద్ధతులు అవలంబించినా, లేకున్నా పత్తి అమ్మకాలకు, ఎరువుల కొనుగోళ్లకు మాత్రం యాప్‌లను తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితి నెలకొంది. సీసీఐలో మద్దతు ధరకు పత్తి కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ అమల్లోకి తెచ్చింది. రైతులు వ్యతిరేకించినా తప్పనిసరి చేసింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం యూరియా అమ్మకాలకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తెచ్చింది. ఫలితంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులందరికీ స్మార్ట్ ఫోన్లు లేకపోవటం, మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సిగ్నల్స్ లేకపోవటం, రైతుల పట్టాదారు పాసుపుస్తకాలకు, ఆధార్‌కార్డులను, ఫోన్ నంబర్లకు అనుసంధానం కాకపోవడంతో ఓటీపీ సమస్యగా మారింది. చదువు రాని రైతులు, నాలుగైదు తరగతులు చదివిన రైతులకు యాప్‌ను వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఓటీపీలు చెప్పటం, స్లాట్ బుకింగ్‌కు ఇతరులపై ఆధారపడాల్సివస్తోంది.
పత్తికి కపాస్ యాప్..
జిల్లాలో వానాకాలం సీజన్‌లో సుమారు 2.15 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. రైతులు పత్తి మద్దతు ధరకు పత్తి విక్రయించాలంటే స్మార్ట్ ఫోన్‌లో కపాస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. తొలుత ఎకరాకు ఏడు క్వింటాళ్లకు మాత్రమే అనుమతినిచ్చారు. రైతుల ఆందోళనతో పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచారు. ముందుగా రైతులు వ్యవసాయశాఖ అధికారులను కలిసి యాప్‌నకు సంబంధించి ఓటీపీలు తెలిపి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. అందరికీ స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, గ్రామాల్లో సిగ్నల్స్ లేకపోవడంతో ఈ ప్రక్రియకు ప్రతిబంధకంగా మారింది. పలుమార్లు యాప్‌లో లాగిన్ అయినా సిగ్నల్స్ సమస్య తలెత్తుతోంది. దీంతో విసిగిపోతున్న రైతులు సీసీఐకి వెళ్లకుండా తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్నారు. క్వింటాకు రూ.వేయి నుంచి రూ.1,500 వరకు నష్టపోతున్నారు.
వానాకాలం తరహాలో రైతులకు యూరియా కోసం ఇక్కట్లు పడకుండా యాసంగి సీజన్‌లో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. యాప్‌ను స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని యూరియా కోసం బుకింగ్ చేసుకోవాలి. జిల్లాలో ఈ యాప్ పనిచేయటం లేదు. యూరియా బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తే ‘మీ జిల్లా పైలెట్ ప్రాజెక్ట్ కిందకు రాదు’అని సూచిస్తోంది. దీంతో రైతులు మళ్లీ పీఏసీఎస్ గోదాంలకు, ఫెర్టిలైజర్ షాపులకు క్యూ కడుతున్నారు. వ్యాపారుల వద్ద ఎక్కువ ధరకు యూరియా కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
పత్తి అమ్మకాలకు కపాస్ కిసాన్ యాప్


