రామయ్య సన్నిధిలో సినీ హీరో కిరణ్ అబ్బవరం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారిని గురువారం సినీ హీరో కిరణ్ అబ్బవరం కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలను, జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్‌వో లింగాల సాయిబాబు, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
అన్నదానానికి
రూ. లక్ష విరాళం
భద్రాచలంటౌన్: జూనియర్ కళాశాల సెంటర్‌లోని శ్రీ సాయిబాబా ఆలయంలో అన్నదానానికి పట్టణానికి చెందిన ఉంగరాల వెంకట్రావు–లక్ష్మి దంపతులు తమ కుమారుడు సాయిదీప్ పుట్టినరోజును పురస్కరించుకుని రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ నిధులతో గురువారం సుమారు 1,400 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ శాలువాతో సత్కరించి బాబా చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొమ్మనాపల్లి ఆదినారాయణ, కోశాధికారి గొర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్లకు
ఆర్థిక పునరావాసం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని ట్రాన్స్ జెండర్ల నుంచి ఆర్థిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో యూనిట్‌కు రూ.75 వేల చొప్పున 8 యూనిట్లు వంద శాతం సబ్సిడీ రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీలోగా కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని, పూర్తి వివరాలకు 63019 81960, 83310 06010 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ జారీ చేసిన గుర్తింపు పత్రం కలిగి, 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ట్రాన్స్‌జెండర్లు అర్హులని తెలిపారు.
దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహక బహుమతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో దివ్యాంగులు దివ్యాంగులను లేదా దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వివాహ ప్రోత్సాహక బహుమతి రూ. లక్ష అందిస్తుందని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణత లెనినా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివాహం జరిగిన సంవత్సరం లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం 1 నుంచి 10వ తరగతి చదువుకునే దివ్యాంగ విద్యార్థులు, ఇంటర్మీడియట్ ఆపై ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సంబంధిత ధ్రువపత్రాలను కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ కార్యాలయంలో అందజేయాలని వివరించారు. పూర్తి వివరాలకు 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఆదివాసీ కాంగ్రెస్ వైస్
చైర్‌పర్సన్‌గా చంద్రకళ
టేకులపల్లి: మండలంలోని కోయగూడెం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పూనెం చంద్రకళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనుబంధ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామకాలను ప్రకటించినట్లు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. గురువారం టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రకళను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్, నాయకులు కోరం మహాలక్ష్మి, బండ్ల రజిని, రాసమల్ల నరసయ్య, ఎనగంటి అర్జున్ రావు, సర్పంచ్ కోరం హనుమంతు, నాయకులు బోడ సరిత, మునుస్వామి, సుగుణ, రఫియా బేగం పాల్గొన్నారు.
11 మంది అరెస్టు
ములకలపల్లి : మండలపరిధిలోని పాతగుండాలపాడు, కమలాపురం శివార్లో రెండు వేర్వేరు చోట్ల కోడిపందేల స్థావరాలపై గురువారం పోలీసులు దాడి చేశారు. 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రూ 19 వేల నగదు, 10 కోడిపుంజులు, ఆరు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు.
రామయ్య సన్నిధిలో సినీ హీరో కిరణ్ అబ్బవరం


