ట్రాలీ బోల్తా : 15 గొర్రెలు మృతి
ఇల్లెందురూరల్: గుండాల మండలం శెట్టిపల్లి గ్రామం నుంచి గురువారం నారాయణపేట జిల్లాకు 70 గొర్రెలను ట్రాలీలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని పోచారంతండా గ్రామ సమీపంలో ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో 15 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల వ్యాపారి వోటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సాధారణ వ్యక్తుల్లా పోలీసుల దాడి
● ముగ్గురు పేకాటరాయుళ్ల అరెస్ట్
పాల్వంచరూరల్: మండల పరిధిలోని దంతలబోరు గ్రామ శివారులో నూతన సంవత్సరం సందర్భంగా గురువారం కొందరు పేకాట ఆడుతున్నారు. సమాచారం రావడంతో స్పెషల్ పార్టీ పోలీసులు, రూరల్ ఎస్‌ఐ సురేష్ సాధారణ వ్యక్తుల్లా ట్రాలీ ఆటోలో వెళ్లి దాడి చేశారు. ఒక్కరిని పట్టుకోగానే మిగతా పందెంరాయుళ్లు ఉరుకులు, పరుగులు పెట్టగా, పోలీసులు వెంబడించారు. ములకలపల్లి మండలం సుందరయ్యనగర్‌కు చెందిన రవ్వ శ్రీరాములు, మాదారం గ్రామానికి చెందిన ఊకంటి కిషోర్, పాల్వంచలోని నటరాజ్ సెంటర్‌కు చెందిన జి.ప్రశాంత్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆరు పందెం కోళ్లు, మూడు స్మార్ట్‌ఫోన్లు, ద్విచక్రవాహనం, రూ.39,450 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


