పిల్లలు, అత్త దూరమై ఆవేదన
తల్లాడ: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలు మృతి చెందారు.. అదే ఘటనలో అత్త, మరో బంధువు మృతి చెంది ఎనిమిది నెలలు దాటినా వారి జ్ఞాపకాలను మరిచిపోలేని వివాహిత తరచూ కన్నీరుమున్నీరయ్యేది. అదే ఆవేదనతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడగా ఆ కుటుంబం మరింత విషాదంలో కూరుకుపోయిన ఘటన ఇది. గత ఏడాది ఏప్రిల్ 29న తల్లాడ మండలం పాత మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ఈ ఘటనలో వినోద్ – రేవతి(30) దంపతుల కవల కుమారులు వరుణ్, తరుణ్ తేజ్, వినోద్ తల్లి సుశీల, మేనకోడలు మృతి చెందారు. అప్పటి నుంచి వినోద్ భార్య రేవతి మానసికంగా కుంగిపోయి తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఇద్దరు పిల్లలే కాక అత్త, మరొకరు మృతితో మనోవేదనకు గురవుతున్న ఆమె డిసెంబర్ 22న ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొంది. ఆ సమయాన ఇంటి ముందు ఉన్న వినోద్ అనుమానంతో తలుపు నెట్టగా రాకపోవటంతో స్థానికుల సహాయంతో పగులగొట్టి అప్పటికే అపస్మారక స్థితికి చేరిన రేవతిని ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేక పరిస్థితి విషమించడంతో రేవతి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపారు.
జ్ఞాపకాలు మరిచిపోలేక వివాహిత ఆత్మహత్య


