ఫ్యూచర్‌పై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌పై నజర్‌

Dec 2 2025 8:28 AM | Updated on Dec 2 2025 8:28 AM

ఫ్యూచ

ఫ్యూచర్‌పై నజర్‌

ఉప్పు కూడా దొరకదు..

సీఎం రేవంత్‌రెడ్డికి స్థానికుల వేడుకోలు

40 ఏళ్లు గడిచినా కేఎస్‌ఎంలో కనిపించని అభివృద్ధి

మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డంకిగా రిజర్వ్‌ ఫారెస్ట్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర రాజధాని ప్రాంతంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు దీటుగా నాలుగో నగరంగా ఫ్యూచర్‌ సిటీని ఏర్పాటు చేసే ప్రయత్నంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో గడిచిన ఏడాది కాలంగా ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే ఒరవడిలో నాలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గర నగరంగా ఉన్న కొత్తగూడేన్ని సైతం ఫ్యూచర్‌ సిటీగా చేయడంపై సీఎం, జిల్లా మంత్రులు దృష్టి సారించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వేర్వేరు మున్సిపాలిటీలుగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచను ఒకటిగా చేస్తూ అందులో సుజాతనగర్‌ మండలంలోని ఏడు గ్రామాలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు ఇప్పటికే మున్సిపాలిటీలుగా ఉండగా కొత్తగూడెం – సుజాతనగర్‌ మధ్య ఉన్న ప్రాంతంలో గతేడాది కాలంగా ఆధునిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కానీ మూడు దశాబ్దాలు గడిచినా కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల మధ్య ఉన్న ప్రాంతం మాత్రం అభివృద్ధికి దూరంగా ఉంది.

భవిష్యత్‌ ఇక్కడే..

కొత్తగూడెం – పాల్వంచ మధ్య ఇల్లెందు క్రాస్‌రోడ్‌ నుంచి నవభారత్‌ వరకు ఉన్న ప్రాంతం రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రంలో కీలకంగా మారనుంది. 40 ఏళ్ల క్రితం ఇక్కడ కొత్తగూడెం స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ (కేఎస్‌ఎం) పేరుతో ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని కేఎస్‌ఎంగా పిలుస్తున్నారు. 2016లో భద్రాద్రి జిల్లా ఏర్పాటయ్యాక ఇక్కడే సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయం(ఐడీఓసీ) నిర్మించారు. జిల్లా అధికారుల నివాస సముదాయాలూ ఇక్కడే ఉన్నాయి. ఐడీఓసీ వెనుకే జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం రాబోతోంది. దానికి సమీపంలోనే తెలంగాణ బెటాలియన్‌ కూడా ఉంది. కాగా రెండేళ్ల కిందట ఇక్కడే మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలూ వచ్చాయి. తాజాగా దేశంలోనే తొలిసారిగా ఎర్త్‌ సైన్సెస్‌ కోర్సులు అందించే డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ యూనివర్సిటీ సైతం ఇక్కడే ప్రారంభం అవుతోంది. కేఎస్‌ఎంకు సమీపంలోనే హరిత హోటల్‌, సెంట్రల్‌ పార్క్‌, అటవీ శాఖ జిల్లా కార్యాలయం వంటివి ఉన్నాయి. జూపార్క్‌ను సైతం ఇక్కడే నెలకొల్పే ఆలోచన ఉంది.

రెవెన్యూగా మారిస్తే..

కేఎస్‌ఎం ప్రాంతంలో నేషనల్‌ హైవేకు ఇరువైపులా ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ స్థలాలను రెవెన్యూ పరిధిలోకి తీసుకుంటే ఆ మేరకు ఇతర ప్రాంతాల్లోని రెవెన్యూ స్థలాలను నిబంధనల ప్రకారం అటవీ శాఖకు అప్పగించొచ్చు. రెవెన్యూ స్థలాల్లో అయితే మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం ఉంటుంది. ఒకవేళ 1/70 చట్టం వంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. స్థానిక యువతకే వేర్వేరు అంశాల్లో శిక్షణ, ఆర్థిక సాయం అందించి వ్యాపార, వాణిజ్య రంగాల్లో ప్రోత్సహించే అవకాశం కలుగుతుంది. తద్వారా స్థానికులకు మౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. చివరకు ఈ ప్రాంతం కొత్తగూడెంలో ఫ్యూచర్‌ సిటీగా ఎదిగేందుకు ఆస్కారం కలుగుతుంది.

జిల్లాకే కాదు రాష్ట్రానికి సంబంధించిన కీలక కార్యాలయాలు, విద్యాసంస్థలు ఉన్న కేఎస్‌ఎం ప్రాంతం మూడు వేల మందికి పైగా విద్యార్థులు, రెండువేల మందికి పైగా ఉద్యోగులకు కీలకం కానుంది. అయితే, ఇక్కడ నివసించే వారికి కనీసం ఉప్పు కూడా లభించడం లేదు. ఇల్లెందు క్రాస్‌ రోడ్‌ నుంచి నవభారత్‌ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతమంతా రిజర్వ్‌ ఫారెస్ట్‌ కావడంతో ఇక్కడ ఉండేవారు అడవిలో ఉన్నట్టుగానే ఉంటోంది. కలెక్టరేట్‌కు వివిధ పనుల కోసం వచ్చే వారు భోజనం చేయాలన్నా, మెస్‌లో ఫుడ్‌ బాగాలేక విద్యార్థులు కనీసం టిఫిన్‌ చేయాలన్నా కిలోమీటర్‌ పైగా ప్రయాణించి నవభారత్‌ లేదా పాల్వంచ, కొత్తగూడెం వరకు వెళ్లాల్సి వస్తోంది.

కొత్తగూడేన్ని ఫ్యూచర్‌ సిటీగా మార్చండి

ఫ్యూచర్‌పై నజర్‌1
1/1

ఫ్యూచర్‌పై నజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement