ప్రభుత్వ అలక్ష్యం
పెట్టుబడిలో సగం కూడా రాదు
ప్రకృతి ప్రకోపం..
● ఈ ఏడాది కౌలు రైతులకు మిగిలింది కన్నీరే.. ● అధిక వర్షాలతో పెరిగిన పెట్టుబడి, తగ్గిన దిగుబడి ● పత్తి, ధాన్యం విక్రయాలకు తప్పని ఇక్కట్లు
బూర్గంపాడు: కౌలురైతుకు కన్నీరే మిగులుతోంది. నాలుగు నెలలపాటు కురిసిన వర్షాలతో పత్తి, వరి పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. అరకొరగా చేతికొచ్చిన పంటను విక్రయించాలన్నా ఇబ్బంది ఎదురవుతోంది. నాణ్యత లేదని, తేమశాతం ఎక్కువగా ఉందంటూ సీసీఐ కొనుగోలు చేయటం లేదు. దీనికితోడు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఫలితంగా కౌలు రైతులు ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు తక్కువ ధరకు పత్తి విక్రయించాల్సి వస్తోంది.
2 లక్షల ఎకరాల్లో కౌలు రైతుల సాగు
జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో దాదాపు 50 వేల మంది కౌలు రైతులు పంటలు సాగుచేస్తున్నారు. ఎక్కు వ విస్తీర్ణంలో పత్తి, వరిని సాగు చేశారు. కౌలు ధర పత్తి సాగుకు ఎకరాకు రూ.20వేల నుంచి రూ. 25 వేల వరకు, వరి సాగుకు రూ.18వేల నుంచి రూ. 22వేల వరకు పెరిగింది. కౌలు రైతులు అప్పులు చేసి భూముల కౌలు, పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంటల్లో కలుపు పెరగడం, చీడపీడలు ఆశించటం, పురుగు, దోమ ఉధృతి ఎక్కువ కావడంతో సస్యరక్షణకు ఎక్కువసార్లు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. గతంలో కంటే ఎకరాకు రూ. 6వేల వరకు పెట్టుబడి పెరిగింది. కొరత కారణంగా పంటకు సకాలంలో యూరియా వేయలేకపోయారు. దీంతో దిగుబడి తగ్గింది. కొందరు రైతులు తప్పక ఎక్కువ ధర ఉన్న కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాల్సి వచ్చింది. పెట్టుబడి పెరిగినా దిగుబడి తగ్గడంతో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పట్టాదారు దయాదాక్షిణ్యాలపైనే..
పండించిన కొద్దిమేర పంటలను అమ్ముకునేందుకు కౌలు రైతులకు పాట్లు తప్పటం లేదు. పత్తి, ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే పట్టాదారు దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సివస్తోంది. సీసీఐలో పత్తి విక్రయాలకు కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేయాలి. దీనికి పట్టాదారు అనుమతితో ఏఈఓలతో సర్టిఫికేషన్, అన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ధాన్యం అమ్ముకున్నప్పుడు పట్టాదారుతో ఓటీపీలు చెప్పించుకోవాలి. ఈ ప్రక్రియ ఇబ్బందికరంగా మారటంతో ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. నిబంధనలను సడలించి నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కౌలు రైతులు కోరుతున్నారు.
ఈ ఏడాది ఎకరాకు రూ.22 వేల కౌలు చెల్లించి 18 ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాను. యూరియా దొరకక పత్తికి కాంప్లెక్స్ ఎరువులు వేశాను. దీంతో పెట్టుబడి పెరిగింది. వర్షాలకు పత్తి దిగుబడి సగానికి సగం పడిపోయింది. పండిన పత్తిని అమ్మాలంటే సీసీఐలో కొనటంలేదు. పెట్టుబడి కూడా పూడని పరిస్థితి.
–చెంచలపు రాములు, కౌలురైతు, నాగినేనిప్రోలు
ప్రభుత్వ అలక్ష్యం


