హార్వెస్టర్ దగ్ధం
గుండాల: మొక్కజొన్న, వరి కోత యంత్రం (హార్వెస్టర్ ) ప్రమాదవశాత్తు బుధవారం దగ్ధమైంది. మండల కేంద్రానికి చెందిన ఊడుగుల యాకయ్య అనే వ్యక్తి హార్వెస్టర్ లీజుకు తెచ్చి మొక్కజొన్న, వరి పంటలను కోయిస్తున్నాడు. రోజూ లాగే మంగళవారం ముత్తాపురం– దొంగతోగు మధ్య మొక్కజొన్న కోశాక ఓ చేనులో యంత్రాన్ని నిలిపివేశాడు. యంత్రం కాలుతుండగా అటుగా వెళ్తున్నవారు గమనించి యాకయ్యకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇల్లెందు నుంచి ఫైర్ ఇంజన్ రప్పించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే సగానికి పైగా కాలిపోయింది. వైరింగ్ సర్క్యూట్ జరిగి నిప్పు అంటుకున్నదా,? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా కావాలనే నిప్పుపెట్టారా..అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభిస్తామని సీఐ రవీందర్ తెలిపారు.
ముద్దాయికి ఆరు నెలల జైలు
మణుగూరు టౌన్: చెక్కు బౌన్స్ కేసులో ముద్దాయికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ మణుగూరు ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి బుధవారం తీర్పునిచ్చారు. సమితిసింగారం గ్రా మానికి చెందిన మేకల రాజయ్య వద్ద సత్యనా రాయణ 2018, అక్టోబర్ 21న రూ. 2.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ప్రతిగా చెక్కును అందజేశాడు. రాజయ్య చెక్కును బ్యాంకులో జమ చేయగా, సరిపడా నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్‌అయింది. దీంతో బాధితుడు న్యాయవాది ద్వారా నోటీసు పంపినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీ లించిన న్యాయమూర్తి పైవిధగా తీర్పు చెప్పారు. ఫిర్యాదుదారునికి రూ.2.50లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారు తరఫున న్యా యవాది నగేశ్‌కుమార్ వాదనలు వినిపించారు.
టిప్పర్ ఢీకొని 8 మేకలు మృతి
●రూ.1.50 లక్షల నష్టం
సుజాతనగర్: మట్టి టిప్పర్ ఢీకొని బుధవారం 8 మేకలు మృతి చెందాయి. మంగపేట గ్రామానికి చెందిన గుగులోత్ హత్తీరాం తన మేకలను మేతకు తోలుకెళ్తుండగా ఆర్వోబీ సమీపంలో మేకలు రోడ్డు దాటుతున్నాయి. ఈ క్రమంలో సుజాతనగర్ వైపు నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.


