స్వరాష్ట్రంలో భద్రగిరికి తొలిసారిగా..
● మేజర్ పంచాయతీలో డిసెంబర్ 11న ఎన్నికలు ● హైకోర్టు కేసుతో గతంలో భద్రాచలంలో జరగని వైనం
భద్రాచలం: తెలంగాణ ఆవిర్భావం తర్వాత భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో తొలిసారిగా స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగినా మున్సిపాలిటీ పై కేసు హైకోర్టులో ఉన్నందున ఇక్కడ జరగలేదు. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 లో ఎన్నికలుజరగ్గా, భూక్యా శ్వేత సర్పంచ్‌గా పని చేశా రు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రాచలం, సారపాకలను మున్సిపాలిటీలుగా ప్రకటించింది. దీంతో ఆదివాసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో మూడు గ్రామపంచాయతీలుగా విభజించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మేజర్ గ్రామపంచాయతీగానే ప్రకటించింది. సర్పంచ్ స్థానం మళ్లీ ఎస్టీ జనరల్‌కే రిజర్వ్ అయింది. 20 వార్డుల్లో 10 వార్డులను ఎస్టీ జనరల్ మహిళలకు కేటాయించగా, మరో 5 వార్డులను జనరల్ విభాగంలోని మహిళలకు, మరో ఐదింటిని జనరల్‌కు రిజర్వేషన్ చేశారు. గురువారం నుంచి ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు.
పోటీ రసవత్తరం
మొదటి విడతలో డిసెంబర్ 11న భద్రాచలంలో ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగనప్పటికీ ప్రధాన పార్టీల మద్దతు కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లంబాడా, కోయ వర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యల ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లంబాడా గిరి జనుల నుంచి హరిశ్చంద్రనాయక్, భూక్యా రంజిత్ నాయక్, భూక్యా శ్వేత పోటీ పడుతున్నారు. ఆది వాసీ గిరిజనుల నుంచి పలువురి పేర్లు వినిపించినా ఏకగ్రీవంగా ఒక్కరినే నామినేట్ చేయాలని ఆది వాసీ సంఘాల జేఏసీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. లంబాడాలకు మద్దతు ఇస్తే భవిష్యత్ ఎన్నికల్లో ప్రతిఘటన ఎదురవుతుందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును ఆదివాసీ సంఘాలు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సర్పంచ్ పోటీ రసవత్తరంగా మారింది.
మానె రామకృష్ణకు బీఆర్‌ఎస్ మద్దతు
ఆదివాసీ నాయకుడు మానె రామకృష్ణకు మద్దతిస్తున్నట్లు బుధవారం బీఆర్‌ఎస్ ప్రకటించింది. మానె రామకృష్ణ గతంలో ఎమ్మెల్యే బరిలో సైతం నిలిచా రు. తొలుత వైఎస్సార్ సీపీలో, అనంతరం బీఆర్‌ఎస్‌లో నియోజకవర్గ నాయకుడిగా పని చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఆయన నిరాకరించినా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, నాయకులు రావులపల్లి రాంప్రసాద్‌లు బుధవారం చర్చలు జరిపి ఒప్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతిస్తుందనేది ప్రకటించాల్సి ఉంది. కాగా అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య తన కుటుంబం నుంచే సర్పంచ్ అభ్యర్థిని పోటీలో ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


