కొనుగోళ్లకు రెడీ
రూ.500 బోనస్
ఇప్పటికే 153 కేంద్రాలను ప్రారంభించిన అధికారులు
ఖరీఫ్ దిగుబడి అంచనా
3.50 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు లక్ష్యం
2.38 లక్షల మెట్రిక్ టన్నులు
పాల్వంచరూల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్ వడ్లు కొనేందుకు పౌరసరఫరాల శాఖ ఈసారి ముందస్తుగానే మేల్కొంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే వరి కోతలు ఇంకా ముమ్మరం కాలేదు. అక్కడక్కడా వరి కోతలు ప్రారంభించిన రైతులు ధాన్యం ఆరబెడుతున్నారు. రైతులు సన్నరకాల వడ్లను వ్యాపారులకు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ లభించనుంది. జిల్లాలో వానాకాలంలో 1,74,250 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల చొప్పున 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
కొనుగోలు లక్ష్యం 2,38,177 మెట్రిక్ టన్నులు
గతేడాది జిల్లాలో 163 కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పౌరసరఫరాలశాఖ అధికారులు కేవలం లక్షా 15వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో దిగుబడి 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో సన్నరకం ధాన్యం 2,02,862 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 35,315 మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్ ఎస్.త్రినాఽథ్‌బాబు తెలిపారు.
మద్దతు ధరలు ఇలా..
ఏ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,369 చొప్పున ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. గతేడాది ఏ గ్రేడ్ వడ్లకు రూ.2,320 చెల్లించగా, దొడ్డు రకం ధాన్యానికి రూ.2,300 చెల్లించింది. ఈసారి అదనంగా రూ.69 ధర పెంచింది.
గత వానాకాలం ఎంత సేకరించారంటే
గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో ఏర్పాటు చేసిన 160 కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి 17,782 మంది రైతుల ద్వారా రూ.262.07 కోట్ల వ్యయంతో లక్షా 13 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లా నాలుగు శాఖల ద్వారా ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. మొత్తం 187 కొనుగోలు కేంద్రాల్లో పీఏసీఎస్‌లకు 111, జీసీసీకి 35, డీసీఎంఎస్‌కు 28, ఐకేపీలకు 13 కేంద్రాలను కేటాయించారు.
జిల్లాలో 187 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 153 కేంద్రాలను ప్రారంభించాం. కొనుగోలు కేంద్రంలో సన్న, దొడ్డు రకాల వడ్లను వేర్వేరుగా కొంటాం. సన్న రకాలను గుర్తించే యంత్ర పరికరాలను కూడా అందుబాటులో ఉంచాం. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి. –ఎస్.త్రినాఽథ్‌బాబు,
జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్
సన్నరకాల ధాన్యాన్ని విక్రయించిన రైతులకు మార్కెటింగ్ శాఖ ద్వారా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించనున్నారు. సన్న, దొడ్డు రకాల వడ్ల కొనుగోళ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రతీ కేంద్రానికి ప్రత్యేక సీరియల్ నంబర్‌తోపాటు ధాన్యం కొనుగోలు చేసి తరలించే గన్నీ బ్యాగులపైనా సీరియల్ నంబర్లను కేటాయిస్తారు.
జిల్లాలో ధాన్యం కొనేందుకు 187 కేంద్రాల ఏర్పాటు..
కొనుగోళ్లకు రెడీ
కొనుగోళ్లకు రెడీ


