మెరుగుపడేనా..?
ఆసన్నమవుతున్న పరీక్షా సమయం
పదో తరగతి ఫీజు తేదీలు ఖరారు
వారంలోగా ఇంటర్మీడియట్
పరీక్ష తేదీలు..
పరీక్ష
ఫలితాలు
కొత్తగూడెంఅర్బన్: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల సమయం ఆసన్నమవుతోంది. పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజుల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెలలోగా పరీక్ష తేదీలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షల తేదీలు వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాలో గతేడాది ఆశించిన ఫలితాలు రాబట్టాలేకపోయిరు. ఈ ఏడాదైనా మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం డీఈవో రిటైర్డ్ కాగా, జెడ్పీ సీఈవోకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో విద్యాశాఖపై దృష్టి సారించే అవకాశం లేకపోవడంతో భారం అంతా జిల్లా విద్యాశాఖ కోఆర్డి నేటర్లపైనే పడినట్లు తెలుస్తోంది.
నో స్నాక్స్
సెప్టెంబర్ నుంచే పదోతరగతి విద్యార్థులకు పాఠశాలల్లోఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసు లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు నీరసపడకుండా ఏటా ప్రత్యేక తరగతుల్లో స్నాక్స్ అందిస్తున్నారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో స్పెషల్ క్లాసుల్లో స్నాక్స్ ఇవ్వడంలేదు. దీంతో విద్యార్థులు నిరుత్సాపడుతున్నారు.
ఇంటర్ విద్యార్థులకు స్టడీ అవర్స్
గతేడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 27వ స్థానంలో నిలువగా 91.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్మీడియట్‌కు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 62.56, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్రస్థాయిలో జిల్లాకు 9వ స్థానం దక్కింది. ఇంటర్మీడియట్‌లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కళాశాలల్లో సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. సైన్స్ గ్రూపుల విద్యార్థులకు హైదరాబాద్ నుంచి ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నారు. స్టడీ అవర్స్‌ను, ఆన్‌లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఇంటర్మీడియట్ అధ్యాపకులు చెబుతున్నారు.
కళాశాలల్లో అమలుకాని మధ్యాహ్న భోజనం
జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలకు విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. చాలా మంది మధ్యాహ్నం లంచ్ బాక్సులు తెచ్చుకోకుండానే కళాశాలలకు వచ్చి సాయంత్రం వరకు ఉంటారు.ఈ నేపథ్యంలో కళాశాలల్లో మధ్యా హ్న భోజనం అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా కళాశాలల నుంచి ఇంటర్మీడియట్ బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించారు. కానీ అమలు చేయడంలేదు. కాగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా సబ్జెక్ట్ ఉపాధ్యాయులను, జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను నియమించారు. ఈ నేపథ్యంలో అధ్యాపకులు విద్యార్థులపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


