మహిళ అదృశ్యం
దమ్మపేట: మహిళ అదృశ్యంపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన కనకం సావిత్రికి ఇద్దరు కుమారులు ఉండగా, వారు ఆమె అంగీకారంలేకుండా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన సావిత్రి ఈ నెల 22న ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. భర్త గోపాలరావు, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లేదు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
మణుగూరు టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ముత్యాలమ్మనగర్ పంచాయతీకి చెందిన మాలెం శ్రీనివాస్(40) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ వేధిస్తుండటంతో ఆరునెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు కూతుళ్లను హాస్టల్‌లో చేర్పించాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఈ నెల 28న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయే దశలో ఉందని, మృతుడి భార్య దుర్గాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రావణ్ తెలిపారు.
ముద్దాయికి ఏడేళ్ల జైలుశిక్ష
కొత్తగూడెంటౌన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యను హతమార్చి, భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ బుధవారం కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె.కిరణ్‌కుమార్ తీర్పుచెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌కు చెందిన రాజేశ్వరికి డోర్నకల్ ప్రాంతా నికి చెందిన కొలిపాక అశోక్‌తో 20ఏళ్ల క్రితం విహహం జరిగింది. అనంతరం వారు పాల్వంచలోని మంచికంటి నగర్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన మాచర్ల ఏసోబు అనే వ్యక్తితో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అశోక్ ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2019 నవంబర్ 5న జరిగిన ఈ ఘటనపై మృతిరాలి సోదరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్‌ను దాఖలు చేశారు. న్యాయమూర్తి 16 మంది సాక్షులను విచారించగా, మాచర్ల ఏసోబుపై నేరం రుజువుకావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించగా, సిబ్బంది జి.రాఘవయ్య, ఎం.శ్రీనివాస్, జె.రవి సహకరించారు.
బొలెరో వాహనం బోల్తా
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబేద్కర్ సెంటర్ నుంచి సారపాక వైపు వస్తున్న ఓ బొలెరో వాహనం డివైడర్‌కు ఉన్న రైలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జేసీబీ సహాయంతో స్థానికులు ఆ బొలెరో వాహనాన్ని పక్కకు జరిపారు.
పేకాట స్థావరంపై దాడి
ములకలపల్లి: మండల పరిధిలోని మాధారం గ్రామశివారులో పేకాట శిబిరంపై బుధవారం దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎస్.మధుప్రసాద్ తెలిపారు. అరెస్టయినవారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని, రూ 5,150, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
తూరుబాకలో చోరీ
దుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక గ్రామానికి చెందిన మోతుకూరి స్వప్న ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. రూ.55వేలు నగదు, రూ.15వేల విలువైన ఫోన్‌ను అపహరించారు. బాధితురాలు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


