బీసీలు రాజ్యాధికారం సాధించాలి..
కొత్తగూడెంఅర్బన్: బీసీలు చైతన్యంతో అగ్రవర్ణాల దోపిడీ పాలనను అంతమొందించాలంటే ఎస్సీ, ఎస్టీలతో జత కట్టి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. సామాజిక చైతన్య రథయాత్ర మంగళవారం కొత్తగూడెంనకు చేరుకుంది. సూపర్‌బజార్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ దోపిడీ పాలన, కుటుంబ పాలన అంతమై కాంగ్రెస్ పాలన వచ్చిందని సంతోషపడితే అంతకంటే ఎక్కువ దోపిడీ జరుగుతోందన్నారు. సీఎం కుటుంబ సభ్యులు, వారి అనుచరులు రాష్ట్రాన్ని జోనల్‌గా విభజించి భూదందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ లాభాల ఆపేక్షతో పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోందని, తక్షణమే ఓపెన్ కాస్ట్ మైనింగ్ నిలిపి, సాంకేతికతతో అండర్ గ్రౌండ్ మైనింగ్ మాత్రమే చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరులలో పూర్తిస్థాయిలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఆడంబరంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీలో ఏడాది గడిచినా ఒక్క బ్యాచ్‌కు కూడా శిక్షణ ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కట్ట సతీశ్, బీరప్ప, మడకం ప్రసాద్, నూనె భాస్కర్‌రావు, రిషబ్‌జైన్, నరసింహారావు, సుధాకర్, బుల్లెట్ వెంకన్న, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.


