కిన్నెరసాని గేటు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలాశయానికి వరద వస్తుండటంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తారు. ఈ మేరకు 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు వెల్లడించారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భద్రాద్రి యువకుడి
హాలీవుడ్ చిత్రం
త్వరలో అమెరికాలో విడుదల కానున్న
‘ది లాస్ట్ విజిల్’
భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన యువ దర్శకుడు కొండపల్లి వివేక్ రూపొందించిన హాలీవుడ్ చిత్రం ‘ది లాస్ట్ విజిల్’ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. భద్రాచలం పట్టణానికి చెందిన రిటైర్డ్ సీఐ కొండపల్లి మహేశ్వరరావు కుమారుడైన వివేక్.. చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. చదువుల అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి, అక్కడ చదువుకుంటూనే సినీ రంగంలో మెళకువలు నేర్చుకుని, దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని రూపొందించాడు. ఇంగ్లిష్‌లో వివేక్ దర్శకత్వం వహించిన ‘ది లాస్ట్ విజిల్’చిత్రం త్వరలోనే అమెరికాలో విడుదల కానుంది.
ఫెడరేషన్ కప్‌నకు
భద్రాద్రి క్రీడాకారుడు
భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డీవీ శంకర్‌రావు హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే ప్రతిష్టాత్మక పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ కప్‌నకు ఎంపికై నట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోగాల శ్రీనివాసరెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయని తెలిపారు. 73 ఏళ్ల వయస్సులో శంకర్‌రావు కేరళలో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించడం అసాధారణమని, ఇప్పుడు ఫెడరేషన్ కప్‌నకు ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా శంకర్‌రావును పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ జీవీ రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణప్రసాద్, జాయింట్ సెక్రెటరీ గుగులోత్ శోభన్‌నాయక్, బోగాల వీరారెడ్డి, చిరంజీవి తదితరులు అభినందించారు.
రెన్యూవల్
చేయించుకోవాలి..
కొత్తగూడెంఅర్బన్: సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది, సీపీఆర్‌ఎంఎస్ స్కీమ్ ద్వారా హెల్త్ కార్డు పొందిన వారు రెన్యూవల్ చేయించుకోవాలని జీఎం (పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్‌ఆర్ జీవీ కిరణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 ఏడాదికి గాను సీపీఆర్‌ఎంఎస్ హెల్త్ కార్డును మీ సేవలోగానీ, ఆన్‌లైన్‌లో గానీ రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.
ఆర్టీసీ బస్సుడ్రైవర్‌కు
గుండెపోటు
తృటిలో తప్పిన ప్రమాదం
భద్రాచలంఅర్బన్: ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో చాకచక్యంగా బస్సును పక్కకు ఆపడంతో ప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి.. భద్రాచలం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును విజయవాడకు నడుపుతున్న డ్రైవర్ వైఎన్.రావుకు తిరువూరు బస్టాండ్ దాటిన కొద్దిసేపటికే చాతిలో త్రీవంగా నొప్పి వచ్చింది. బస్సులో ఉన్న కండక్టర్, స్థానికులు వెంటనే డ్రైవర్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు వైఎన్.రావును విజయవాడకు తరలించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం డ్రైవర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా, చాతిలో నొప్పి వచ్చిన సమయంలో డ్రైవర్ బస్సును పక్కకు ఆపడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
చికిత్స పొందుతున్న మహిళ మృతి
ఇల్లెందు: గడ్డిమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ సోమవారం రాత్రి మృతిచెందింది. పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన బండ జ్యోతి (36) ఈ నెల 2వ తేదీన గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు ఇల్లెందు వైద్యశాలకు అక్కడి నుంచి ఖమ్మం, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సోమవారం ఎంజీఎంలో మృతి చెందింది. ఎంఏ, బీఈడీ చేసిన జ్యోతి పుట్టుకతో వికలాంగురాలు. ఉద్యోగం రాక, వివాహం జరుగక తీవ్ర మనోవేదనకు గురైంది. కుటుంబానికి భారంగా ఉండొద్దని భావించి, పురుగుమందు తాగింది. తండ్రి పోషయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కిన్నెరసాని గేటు ఎత్తివేత


