జాబ్‌మేళాలకు స్పందన
● 23,650 మందికి ఉద్యోగాలు ● సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహణ
కొత్తగూడెంఅర్బన్: పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల యువతకు హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కల్పిస్తోంది. ఆరు నెలలుగా మెగా ఉద్యోగమేళాలు నిర్విరామంగా కొనసాగిస్తోంది. దాదాపు 24 వేల మందికి కొలువులను కల్పించి వారిలో నూతన ఉత్సాహం నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆలోచనలతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో ఆరు నెలల్లో 7 పట్టణాల్లో నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమాల్లో 66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, వారిలో 23,650 మందికి ఉద్యోగాలు లభించడం విశేషం. ఏడో తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు గల వారితో పాటు, టెక్నికల్, మెడికల్, పారామెడికల్ తదితర అన్ని విద్యార్హతలు గల వారికి ఇక్కడ తమ అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఎంచుకునే అవకాశం దక్కింది. ఒక్కొక్క జాబ్‌మేళాలో 100 నుంచి 250 వరకు ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సౌజన్యంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని మేళాలో పాల్గొన్న నిరుద్యోగ యువత, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. ఈ జాబ్‌మేళా కార్యక్రమాలను ఏప్రిల్ 21వ తేదీన మధిరలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సారథ్యంలో నిర్వహించారు. అదే నెల 27వ తేదీన భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో.. మే 18న గోదావరిఖనిలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు, సీఎండీ బలరామ్ ఆధ్వర్యంలో.. మే 24వ తేదీన వైరాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో.. మే26న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి ఆధ్వర్యంలో.. అదేరోజు బెల్లంపల్లిలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో జాబ్‌మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు.


