షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధం
దమ్మపేట: షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని బాలాజీ థియేటర్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దమ్మపేట బాలాజీనగర్‌లో స్థానికంగా నివాసం ఉంటున్న నల్లబోతుల మహేశ్ తన కారును ఇంటి ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసి, ఇంట్లోకి వెళ్లాడు. కారు నుంచి పొగలు రావడం గమనించిన అతడు, స్థానికుల సాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకునే లోపే కారు పూర్తిగా కాలిపోయింది.
దాడిచేసిన వ్యక్తిపై కేసు
పాల్వంచరూరల్: గొర్రెల షెడ్డులోకి వచ్చిన వ్యక్తి.. యజమానిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని పాండురంగాపురానికి చెందిన వీరబోయిన మహేశ్ గొర్రెల షెడ్డులోకి ఈ నెల 24వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ఎల్లావుల సంతోష్ వచ్చాడు. గమనించిన మహేశ్ ఎందుకొచ్చావని అడిగితే కత్తితో దాడి చేశాడు. గొర్రెలను చోరీ చేసేందుకు వచ్చి, కత్తితో పొడిచాడని మంగళవారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ విజయ్‌సింహారెడ్డి కథనం మేరకు.. వాహనంలో పశువులను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు మర్రిగూడెం శివారులో మంగళవారం దాడులు నిర్వహించారు. ఆవులు, దూడలను హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తున్న టాటా ఏస్ మినీ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పాల్వంచ: పాల్వంచలోని నవభారత్ వద్ద గల బాలికల హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకునేందుకు యత్నించింది. గుర్తించిన తోటి విద్యార్థులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలికకు కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, బాలిక తల్లిదండ్రులు గొడవ పడి వేరుగా ఉంటామని ఫోన్‌లో బాలికకు చెప్పడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ మైథిలి, ఎస్‌ఐ సుమన్‌ను వివరణ కోరగా.. కుటుంబ సభ్యుల కలహాలతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసిందని, తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు.


