
నకిలీ వే బిల్లుల ముఠా గుట్టురట్టు
అశ్వాపురం: నకిలీ వే బిల్లులతో లారీలో ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురిని అరెస్టు చేయగా ముగ్గురు పరారీలో ఉన్నారు. గురువారం అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. జగ్గారంక్రాస్ రోడ్డు వద్ద ఈ నెల 8న అశ్వాపురం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి.. టీఎస్30టీఏ 6498 నంబర్ గల ఇసుక లోడ్ లారీని ఆపి, పరిశీలించారు. డ్రైవర్ నాతి రాములు చూపించిన వే బిల్లుపై అనుమానం వచ్చి ప్రశ్నించగా అది నకిలీ వే బిల్లు అని, దానిని తమ యజమాని హైదరాబాద్‌కు చెందిన కర్నాటి శివశంకర్ ద్వారా పంపించాడని, రామానుజవరం ర్యాంపులో ఓ వ్యక్తి తనకు డీడీ లేకుండా ఇసుక లోడ్ చేశాడని తెలిపాడు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. తరువాత పోలీసులు రామానుజవరం ఇసుక ర్యాంపులో తనిఖీ చేయగా అక్కడ పనిచేసే టీజీఎండీసీ ఉద్యోగులు దగ్గు నిఖిల్‌దీప్, నాగేల్లి మధు, బొల్లెద్దు అనిల్ డీడీ లేకుండా అనుమతులు ఇవ్వగా.. జేసీబీ డ్రైవర్ ఇరగదిండ్ల ఉపేందర్ ఇసుక లోడ్ చేశాడని, అతడికి సూపర్‌వైజర్‌గా పనిచేసే సతీశ్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పాడని తేలింది. దీంతో హైదరాబాద్ హయత్‌నగర్‌లోని కర్నాటి శివశంకర్ నివాసానికి వెళ్లి విచారించగా.. యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన కిరణ్ తనకు నకిలీ వే బిల్లులు తయారు చేయడం నేర్పించాడని చెప్పాడు. కిరణ్‌పై 2023లో నకిలీ వే బిల్లులు తయారు చేయగా.. వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై, జైలుకు కూడా వెళ్లాడని శివశంకర్ పోలీసులకు వివరించాడు. కాగా, కర్నాటి శివశంకర్, నాతి రాములు, ఇరగదిల్ల ఉపేందర్, దగ్గు నిఖిల్‌దీప్, నాగేల్లి మధు, బొల్లేదు అనిల్‌ను అరెస్ట్ చేశామని, కిరణ్, సతీశ్‌రెడ్డి, సుర్వే శ్రీకాంత్ (లారీ ఓనర్) పరారీలో ఉన్నారని డీఎస్పీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలిస్తే అశ్వాపురం ఎస్‌హెచ్‌ఓ 87126 82093, డీఎస్పీ 87126 82006 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. సమావేశంలో అశ్వాపురం సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరుగురు నిందితుల అరెస్టు..
పరారీలో ముగ్గురు