
మాదకద్రవ్య రహిత సమాజానికి పాటుపడదాం
మణుగూరురూరల్: మాదకద్రవ్య రహిత సమాజానికి పాటుపడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని సమితిసింగారం గ్రామ పంచాయతీ అశోక్‌నగర్‌లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో అశ్వాపురం, ఏడూళ్లబయ్యారం సీఐలు అశోక్‌రెడ్డి, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, సిబ్బంది అశోక్‌నగర్‌లోని ప్రతీ ఇంటిని జాగిలాలతో తనిఖీ చేసి సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు లేని 58 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలు, బెల్ట్ షాపుల్లోని రూ.30 వేల విలువల గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా డ్రగ్స్‌పై యుద్ధం చేపట్టినట్లు తెలిపారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సీహెచ్ నగేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.