
గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి
దుమ్ముగూడెం/భద్రాచలంఅర్బన్: భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్తున్న భద్రాచలం ఆర్టీసీ డిపో కండక్టర్ డి.సైదులు (55) గుండెపోటుతో మృతి చెందాడు. భద్రాచలం నుంచి గురువారం వెంకటాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ములకపాడు వద్దకు చేరగానే సైదులుకు ఛాతి నొప్పి రావడంతో బస్సులోనే ఉన్న పర్ణశాల డాక్టర్ రేణుకారెడ్డి, మరో నర్స్ ములకపాడు వైద్యశాల దగ్గర బస్సు నిలిపారు. అనంతరం సైదులును ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా డాక్టర్ రుక్మాకర్‌రెడ్డి సీపీఆర్ చేశాక భద్రాచలం తరలించేసరికి సైదులు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, సైదులు స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు కాగా, ఆయన మృతిపై డీఎం జంగయ్య, ఆర్టీసీ సీఐ రామయ్య, ఉద్యోగులు సంతాపం తెలిపారు. అలాగే, ఆయన అంత్యక్రియలకు డీఎం జంగయ్య రూ.30 వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
చెరువులో పడి వ్యక్తి..
బూర్గంపాడు: మతిస్థిమితం లేని వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన గురువారం సారపాకలోని తాళ్లగొమ్మూరులో చోటుచేసుకుంది. మేడేకాలనీకి చెందిన ధరావత్ నందనాయక్ (40) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన రాత్రి వరకు రాలేదు. గురువారం తాళ్లగొమ్మూరులోని చెరువులో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి నందనాయక్‌గా గుర్తించారు. నందనాయక్‌కు అప్పుడప్పుడూ ఫిట్స్ వస్తాయని, చెరువులోకి దిగినప్పుడు ఫిట్స్ వచ్చి మునిగి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి భార్య లీల ఫిర్యాదు మేరకు అదనపు ఎస్‌ఐ నాగభిక్షం కేసు నమోదు చేశారు.