
అందరికీ పోషకాహారం అందించాలి
అశ్వారావుపేటరూరల్: అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ క్రమం తప్పకుండా పోషకాహారం అందేలా సిబ్బంది కృషి చేయాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి(డీడబ్ల్యూఓ) స్వర్ణలతా లెనీనా అన్నారు. అశ్వారావుపేట రైతువేదికలో బుధవారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ముందుగా సిబ్బంది ప్రదర్శించిన పోషకాహారం, చిరు ధాన్యాల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, పోషకాలు అధికంగా ఉండే వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పీహెచ్‌సీ వైద్యాధికారి రాందాస్‌నాయక్ మాట్లాడుతూ.. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకునేలా అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని కోరారు. పోషణ లోపం ఉన్న పిల్లలను ఎన్‌ఆర్‌సీ కేంద్రాలకు పంపించాలని అన్నారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావు, సీడీపీఓ ముత్తమ్మ, ఏసీడీపీఓ అలేఖ్య, సూపర్‌వైజర్లు వరలక్ష్మీ, రమాదేవి, సౌజన్య పాల్గొన్నారు.
డీడబ్ల్యూఓ స్వర్ణలతా లెనీనా