
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ఆమోదించాలి
జూలూరుపాడు: రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. ఇటీవల మృతి చెందిన ఏసీపీ సబ్బత్తి విష్ణుమూర్తి కుటుంబాన్ని బుధవారం ఆయన వెంగన్నపాలెంలో పరామర్శించారు. విష్ణుమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జూలూరుపాడు సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రతిపాదన వచ్చినా పార్లమెంట్‌లో చట్టం చేయకుండా మోదీ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. విద్యుత్ రెగ్యులేటరీ బిల్లుతో దేశంలోని విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టాలని కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వమే యూరియా కొరతను సృష్టిస్తోందని ఆరోపించారు. విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నవంబర్ 26న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి యాసా నరేష్, గార్లపాటి వెంకటి, వల్లమల్ల చందర్‌రావు, బోడా అభిమిత్ర, బొల్లి లక్ష్మయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వెంకట్