
కల్వర్టు పైనుంచి పడి మహిళ మృతి
పాల్వంచ: మద్యం మత్తులో మహిళ కల్వర్టు పైనుంచి కింద పడి మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గతంలో పాల్వంచలో నివాసం ఉండి, ప్రస్తుతం విజయవాడలో ఉంటున్న షేక్ జానీ భార్య మెహబూబీ(35) డబ్బులు రావాల్సి ఉందంటూ పది రోజుల క్రితం పాల్వంచ వచ్చింది. అప్పటి నుంచి జయమ్మ కాలనీలో సోదరుడి ఇంటి వద్ద ఉంటోంది. డబ్బులు తీసుకుని విజయవాడ వెళ్తానంటూ మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం కుంటినాగుల గూడెం సమీపంలో మద్యం తాగి అక్కడే స్థానికులతో కొంత సేపు గొడవ పడింది. ఆ తర్వాత రోడ్డు మూలమలుపు వద్ద పడిపోయింది. అటుగా వెళుతున్న ఓ లారీ డ్రైవర్, క్లీనర్ రాత్రి 11 గంటల సమయంలో గమనించి, ఆమెను వాహనాలు తొక్కి వెళ్లే ప్రమాదం ఉందని లేపి, పక్కనే ఉన్న కల్వర్టుపై కూర్చోబెట్టి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తర్వాత మత్తులో ఉండి కల్వర్టు పైనుంచి కింద పడింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బుధవారం సాయంత్రం స్థానికుల సమాచారంతో వచ్చి పోలీసులు బయటకు తీశారు. అయితే అప్పటికే మృతి చెందింది. ఈ విషయమై ఎస్‌ఐ సుమన్‌ను వివరణ కోరగా.. మద్యం మత్తులో కల్వర్టు పైనుంచి కిందపడి మృతి చెందినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించామని తెలిపారు. ఫిర్యాదు వచ్చాక కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.