
టీకాలతోనే గాలికుంటు వ్యాధి నివారణ
పాల్వంచరూరల్: పశువులకు సమయానికి టీకా వేస్తే గాలికుంటు వ్యాధిని నివారించవచ్చని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు 7వ విడత గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం మండలంలోని సోములగూడెం గ్రామంలో పశువులకు టీకా వేసి జిల్లా పశుసంవర్థకశాఖ అధి కారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి సోకితే పశువుల్లో ఉత్పాదక శక్తి, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. జిల్లాలో మొత్తం 3.71లక్షల ఆవులు, గేదెలు, ఎద్దులు, దూడలు ఉన్నాయని తెలిపారు. అన్ని మండలాల్లో టీకాలు వేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాలో 60 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. రోజూ ఉదయం పశువులకు టీకాలు వేసి భారత్ పశుధాన్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉప సంచాలకులు డాక్టర్ సత్యప్రసాద్, మండల పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ జి.రమేష్, గోపాల మిత్రలు మహ్మద్ సాబీర్ పాషా, షేక్ అస్గర్, రాధారామ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి
డాక్టర్ వెంకటేశ్వర్లు