
66 గ్రాముల బంగారం స్వాధీనం
చర్ల: మండలంలోని గాంధీనగరంలో ఈ నెల 8న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. బుధవారం చర్ల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ వివరాలను వెల్లడించారు. ఏఎస్పీ కథనం ప్రకారం.. సూరవీడుకు చెందిన ముత్యబోయిన ప్రేమ్‌చంద్ గొమ్ముగూడెం గ్రామ పంచాయతీ గాంధీనగరంలోని స్నేహితుడికి ఇంటికి వచ్చాడు. గాంధీనగరానికి చెందిన కోడిరెక్కల భాస్కర్‌రావు కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడ్డాడు. ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.7.60 లక్షల విలువ చేసే 66.414 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 80 వేల నగదు అపహరించుకుపోయాడు. బాధితుడు ఈ నెల 10న ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మండలంలోని సుబ్బంపేట శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వెంకటాపురం వైపు నుంచి చర్లకు వస్తున్న ప్రేమ్‌చంద్ పోలీసులను చూసి పారిపోతుండగా వెండించి పట్టుకున్నారు. విచారించడంతో చోరీ విషయం వెల్లడించాడు. పోలీసులు బంగారు ఆభరణాలను స్వాధీ నం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్‌లను ఏఎస్పీ అభినందించారు.
చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు