
ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
భద్రాచలంఅర్బన్: పట్టణంలో పోలీసులు ము మ్మరంగా తనిఖీలుచేపట్టారు. ఆదివారం రాత్రి పట్టణంలోని బ్రిడ్జి పాయింట్, బస్టాండ్ అంబేద్కర్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. బయోమెట్రిక్ ఆధారంగా అనుమానిత వ్య క్తుల వివరాలు తెలుసుకున్నారు. రాత్రిపూట ప్రయాణికులు లేకుండా తిరుగుతున్న ఆటోలను నిలిపి డ్రైవర్లను ప్రశ్నించారు. పలువురు యువతకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రైవేటు బస్సులను సైతం తనిఖీ చేసి అనుమతి పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఆయా బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని లగేజీలను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి సీఐ నాగరాజు పలు సూచనలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మణుగూరుకు చెందిన రాపర్తి లక్ష్మి ఆటోలో కొత్తగూడెం వైపు వెళ్తుండగా మొండికుంట వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై గుంత ఉండటంతో ఆటోలో నుంచి మహిళ అదుపుతప్పి రహదారిపై పడి తీవ్రంగా గాయపడింది. ఆమెను 108లో మణుగూరు తరలించి అక్కడి నుంచి భద్రాచలం తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు.