
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
చింతకాని: మండలంలోని నాగులవంచ పెట్రోల్ బంకు వద్ద ఆదివారం ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన బంధం లక్ష్మీనారాయణ (45) మృతి చెందగా అతని కుమారుడు గగన్‌కు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కొణిజర్ల మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులతో కలిసి ఖమ్మంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావటంతో ద్విచక్ర వాహనంపై తన కుమారుడితో కలిసి ఖమ్మం నుంచి ముష్టికుంట్ల గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో నాగులవంచ పెట్రోల్ బంకు వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో లక్ష్మీనారాయణతో పాటు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపటికే లక్ష్మీనారాయణ మృతి చెందగా, కుమారుడు గగన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తండ్రి మృతి, కుమారుడికి గాయాలు