
మరో విద్యుత్ ప్లాంట్‌కు ముందడుగు
పాల్వంచ: పాల్వంచలో మరో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మరో ముందుడుగు పడిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం కేటీపీఎస్ గెస్ట్‌హౌస్‌లో కేటీపీఎస్ 5,6,7 దశల చీఫ్ ఇంజనీర్లు ఎం.ప్రభాకర్ రావు, శ్రీనివాస్ బాబులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. కొత్త ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలతలపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై డిజైన్ కంపెనీకి సర్వే చేయాలని నిధులు మంజూరు చేయడం జిల్లా ప్రజలకు ఊరటనిచ్చే అంశమని అన్నారు. ఇక్కడ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 450 ఎకరాల భూమి 800 మెగావాట్ ప్లాంట్‌కు సరిపోతుందని, రెండు కర్మాగారాలు నిర్మించాలంటే మరో 200 ఎకరాలు అవసరం ఉంటుందని, దీని కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం కూడా పరిశీలిస్తామన్నారు. ఇప్పటికే కార్పొరేషన్ చేశామని, ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించడంతోపాటు, అభివృద్ధి శరవేగంగా జరిగే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఎన్‌ఎండీసీ కర్మాగారం విస్తరణను కూడా ప్రైవేట్ కంపెనీకి అప్పగించి ఇక్కడ పరిశ్రమ తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నానని అన్నారు. సమావేశంలో ఎస్‌ఈ యుగపతి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, సీతారామి రెడ్డి, దుగ్గిరాల సుధాకర్, ముత్యాల విశ్వనాధం, పూర్ణచందర్ రావు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు