
అటవీ ఉద్యోగుల క్రీడలు షురూ..
● జోనల్ పరిధి నుంచి హాజరైన ఉద్యోగులు ● పోటీలను ప్రారంభించిన సీసీఎఫ్ భీమానాయక్
చుంచుపల్లి: రెండు రోజుల పాటు నిర్వహించనున్న అటవీ శాఖ ఉద్యోగుల జోనల్ స్థాయి క్రీడా పోటీలను కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సీసీఎఫ్ భీమానాయక్ శుక్రవారం ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల ఉద్యోగులకు 800 మంది అథ్లెటిక్స్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షటిల్, రన్నింగ్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు కబడ్డీ, షటిల్, రన్నింగ్, వాలీబాల్, క్రికెట్ పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల ప్రారంభం సందర్భంగా భీమానాయక్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అటవీ, పర్యావరణ పరిరక్షణలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని చెప్పారు. ఇదే సమయాన క్రీడలపై ఆసక్తి చూపాలని సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించే పలు క్రీడాంశాల్లో చురుగ్గా పాల్గొని ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల డీఎఫ్‌ఓలు, ఎఫ్‌డీఓలు, డీఆర్‌ఓలు, రేంజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.