
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
హుండీ ఆదాయం రూ.41.02 లక్షలు
పెద్దమ్మతల్లి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం లెక్కించారు. మే 29 నుంచి ఈనెల 8 వరకు కానుకలు లెక్కించగా రూ.41,02,731 ఆదాయం లభించింది. ఇంకా నాలుగు విదేశీ నోట్లు, విదేశి నాణేలు 20 లభ్యమయ్యాయి. అలాగే 2024 మార్చి 14 నుంచి ఈనెల 8 వరకు హుండీల్లో 120 గ్రాముల మిశ్రమ బంగారం, 2.600 కేజీల వెండి లభించినట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. దేవాదాయ శాఖ డివిజినల్ పరిశీలకులు పి.భేల్‌సింగ్ పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు.
పామాయిల్ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు
ఆయిల్‌ఫెడ్ ఓఎస్‌డీ కిరణ్‌కుమార్
అశ్వారావుపేటరూరల్ : స్థానిక నర్సరీలో రైతులకు అవసరమైన పామాయిల్ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు ఆయిల్‌ఫెడ్ ఓఎస్‌డీ కిరణ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన పీఈక్యూ(పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్) నిపుణుల బృందంతో కలిసి అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్ నర్సరీని సందర్శించారు. పామాయిల్ మొక్కల పెంపకానికి సిద్ధం చేసిన షేడ్ నెట్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెలాఖరు నాటికి విత్తనాలు నాటే ప్రక్రియ పూర్తి చేస్తామని, 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా 4.50లక్షల మొక్కలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఓపీడీ మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి, ఉద్యాన శాస్త్రవేత్త విద్యాసాగర్, క్వారంటైన్ నిపుణులు వెంకటరెడ్డి, ఆయిల్‌ఫెడ్ డీఓ రాధాకృష్ణ, ఖమ్మం డీఓ సబావత్ శంకర్ పాల్గొన్నారు.
హాస్టళ్లకు
వంట సామగ్రి పంపిణీ
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు నూతన వంట సామగ్రి పంపిణీ చేశామని డీడీ జి.అశోక్ తెలిపారు. పట్టణంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహ సిబ్బందికి గురువారం ఆయన సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని 23 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు వంట సామగ్రితో పాటు 3,023 మంది విద్యార్థులకు ప్లేటు, గ్లాసు, స్నాక్స్ గిన్నెలు పంపిణీ చేశామని వివరించారు. కార్యక్రమంలో ఇల్లెందు ఏటీడీఓ భారతీదేవి, అధికారులు వెంకటరమణ, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం