బాంబుల భయం! | - | Sakshi
Sakshi News home page

బాంబుల భయం!

Oct 9 2025 3:11 AM | Updated on Oct 9 2025 3:11 AM

బాంబు

బాంబుల భయం!

కఠిన చర్యలు తీసుకుంటాం

నివాస ప్రాంతాల్లో అక్రమంగా బాణసంచా నిల్వలు

నిబంధనలు, జాగ్రత్తలు పాటించని కొందరు వ్యాపారులు

అక్రమ నిల్వలపై భద్రాచలంలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

జిల్లావ్యాప్తంగా టపాసుల అక్రమ నిల్వలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యనే పెద్ద ఎత్తున బాణసంచా నిల్వ చేస్తున్న గోదాంలపై మంగళవారం భద్రాచలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. జనావాసాల నడుమ ఇరుకు ప్రదేశంలో ఐదు నుంచి పది లక్షల రూపాయల విలువైన బాణసంచా ఉన్నట్టు గుర్తించి, కేసు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా అక్రమంగా బాణసంచా నిల్వ చేయడం ఒక్క భద్రాచలంలోనే కాదు జిల్లా అంతటా జరుగుతోంది. అయినా పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ యంత్రాంగాలు ఈ వ్యవహారం పట్ల చూసీచూడనట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

ఐదు కేజీలకు మించితే..

దీపావళి పర్వదినం సందర్భంగా కుటుంబ సమేతంగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఒక ఇంట్లో మొత్తంగా ఐదు కేజీల బరువైన బాణసంచా నిల్వ చేసుకునేందుకు ఎటువంటి అనుమతులు అక్కర్లేదు. అంతకు మించితే కచ్చితంగా పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. బాణసంచాలో ఉపయోగించే పేలుడు పదార్థాలకు పొరపాటున నిప్పు రాజుకుంటే పెను ప్రమాదం జరిగి, క్షణాల్లో ఆ ఇంటిని దాని చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను చుట్టుముడుతుంది. తేరుకునేలోపే కోలుకోలేని విధంగా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్లే బాణసంచా అమ్మకాలు, నిల్వ చేయడంపై కఠినమైన ఆంక్షలను చట్టాల రూపంలో ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి.

నిబంధనలు ఇలా..

బ్రిటీష్‌కాలం నుంచి బాణసంచా నిల్వ చేయడంపై చట్టాలు ఉన్నాయి. ఇవి అనేక మార్పులకు లోనవుతూ చివరిసారిగా 2012లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బాణసంచా నిల్వ చేసే ప్రదేశం (షాపు, గోదాం) దగ్గర 5 కేజీల సామర్థ్యం కలిగిన రెండు అగ్నిని ఆర్పే పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇంటి పైకప్పు పైన వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంక్‌, దిగువ భాగంలో 450 లీటర్ల సామర్థ్యం కలిగిన నీళ్ల ట్యాంకు ఉండాలి. నాణ్యత కలిగిన కరెంటు వైర్లను ఉపయోగించాలి. ఇటుకలు, కాంక్రీట్‌, జీఐషీట్స్‌ వంటి అంటుకునే స్వభావం లేని వస్తువులతోనే బాణసంచా నిల్వ చేసే గదులు/గోదాంలను నిర్మించాలి. ఈ గదుల దగ్గర మండే స్వభావం కలిగిన కలప, బట్టలు, ప్లాస్టిక్‌ వంటి వస్తువులు ఉండకూడదు. ఈ బాణసంచా నిల్వ చేసే గదులు/గోదాంలు రోడ్డు నుంచి కనీసం మూడు కిలోమీటర్ల లోపలికి ఉండాలి. వీటి చుట్టూ 15 మీటర్ల వరకు మరే ఇతర నిర్మాణాల ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇళ్ల మధ్యనే నిల్వలు

దీపావళి సంబరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. అప్పటికే తమ రెగ్యులర్‌ వ్యాపారాలకు ఉపయోగించే పని ప్రదేశాల(షాపులు, గోదాంలు)లోనే బాణసంచా కూడా నిల్వ చేస్తున్నారు. పేలే స్వభావంలేని సాధారణ వస్తువులు నిల్వ చేసేందుకు ఉపయోగించే ప్రదేశాలు ఇళ్ల మధ్యన, కిక్కిరిసిన మార్కెట్‌ ఏరియాల్లోనే ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లోనే యథేచ్ఛగా బాణసంచా నిల్వ చేస్తున్నారు. కేవలం దీపావళికి వారం రోజులపాటు జరిగే వ్యాపారం కోసం రక్షణ నిబంధనలు అమలు చేయడం అనవసర ఖర్చు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కేవలం లాభాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

గుణపాఠం నేర్చుకోకుంటే..

ఏపీలోని కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ నిల్వ కేంద్రంలో బుధవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించినట్టు సమాచారం. అంతకుముందు 2018లో వరంగల్‌లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఘటన స్థలిలోనే పది మంది కార్మికులు మాడిమసై పోయారు. పేలుడు తీవ్రతకు చుట్టు పక్కల ఇళ్లు దెబ్బతిన్నాయి. గోడలు, ఇంటి పైకప్పు ఊడిపోయి ఇళ్లలో ఉన్నవారిపై పడి గాయాలయ్యాయి. ప్రమాదాలు చెప్పి రావు, అవి చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ లాభాలే ధ్యేయంగా కొందరు వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరు ప్రమాదాలకు ఆహ్వానంగా మారుతోంది. దీపావళి పండుగ రాకముందే బాణసంచా, టపాకాయలను భారీ ఎత్తున ఇళ్ల మధ్యన నిల్వ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమతుల సంగతి మొత్తానికే పక్కన పెట్టడంతో పాటు ఇరుగుపొరుగు వారిని ప్రమాదంలోకి నెడుతున్నారు.

అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేయడం నేరం. విక్రయాలకు కూడా అధికారుల అనుమతులతోనే చేపట్టాలి. అక్రమ నిల్వలను గుర్తించేందుకు భద్రాచలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనుమతులు లేకుండా నిల్వ చేసినట్లు గుర్తిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా ఎక్కడైనా బాణసంచా అక్రమంగా నిల్వచేసినా, విక్రయిస్తున్నా డయల్‌ 100తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

– విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, ఏఎస్పీ, భద్రాచలం

బాంబుల భయం!1
1/1

బాంబుల భయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement