
అక్షర జ్ఞానం కోసం..
అశ్వారావుపేటరూరల్: వలస గొత్తికోయ చిన్నారులు ‘అక్షర’ సేద్యానికి ‘నడక’యాతన పడుతున్నారు. అడవి, పంట పొలాల మధ్య నుంచి రోజూ కాలినడకన సర్కారు బడికి రాకపోకలు సాగిస్తున్నారు. మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రమణక్కపేట గొత్తికోయల కాలనీకి చెందిన 8 మంది బడిఈడు పిల్లలు రెండున్నర కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటిమడుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది జూన్‌లో చేరారు. వీరి వయసు పదేళ్లలోపే ఉన్నప్పటికీ రోజూ ఐదు కిలోమీటర్లు నడుస్తున్నారు. వలస గొత్తికోయలు ఇరవై ఏళ్లుగా అడవిలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా, ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలు లేవు. పాఠశాలలో కొత్తగా విధుల్లోచేరిన టీచర్ శ్రుతి ప్రత్యేకదృష్టి పెట్టి చిన్నారులను బడి బాట పట్టించారు. కాగా, ప్రభుత్వం, దాతలు స్పందించి చిన్నారులకు వాహన సదుపాయం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
రోజూ ఐదు కిలోమీటర్ల దూరం నడుస్తున్న గొత్తికోయ చిన్నారులు