
ఇంతింతై.. వనమంతై !
ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు వివరాలు
48వేల ఎకరాల నుంచి
1.22లక్షల ఎకరాలకు చేరిక
అనుకూలిస్తున్న నేలలు..
ఇక్కడే పరిశ్రమలు
సాగులో రాష్ట్రంలోనే
అగ్రస్థానాన ఉమ్మడి ఖమ్మం
ఆయిల్‌పామ్ సాగుకు మొగ్గు
ప్రభుత్వ ప్రోత్సాహంతో...
ఖమ్మంవ్యవసాయం: ఆయిల్ పామ్ విస్తీర్ణం ఉమ్మ డి జిల్లాలో ఏటేటా పెరుగుతోంది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలకు తోడు అనుకూలిస్తున్న వాతావరణం, అందుబాటులో ఫ్యాక్టరీలు ఉండడం సాగు పెరగడానికి ఊతమిసోంది. సాగు విస్తీర్ణాన్ని పెంచాలని గత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో అనుకూలంగా ఉన్నాయని గుర్తించారు. దీంతో జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో రైతులు కూడా ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 3లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతుంటే.. సింహభాగం ఉమ్మడి జిల్లాలోనే ఉండడం విశేషం.
ప్రభుత్వం నుంచి రాయితీలు
ఆయిల్‌పామ్ మొక్కలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేయడమే నాలుగేళ్ల పాటు అవసరమైన ఖర్చులను అందిస్తోంది. రూ.193 విలువైన మొక్క ను కేవలం రూ.20కే అందిస్తున్న ప్రభుత్వం ఏటా నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు రూ.4,200 రైతులకు చెల్లిస్తోంది. అలాగే, డ్రిప్ పరికరాలను ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, సన్నకారు రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం సబ్సి డీపై అందిస్తున్నారు. మొత్తంగా ఎకరాకు రూ. 50,918 రాయితీ అందుతోంది. ఇక ఆయిల్‌పామ్ సాగుతో 30 ఏళ్లపాటు ఆదాయం లభించనుండడం.. ప్రకృతి వైపరీత్యాలు, కోతుల సమస్య లేకపోవడంతో రైతులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఐదేళ్లలో 75వేల ఎకరాలు
ఆయిల్‌పామ్ సాగులో రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా అగ్రస్థానాన నిలుస్తోంది. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటల్లో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యాన రెండు పరిశ్రమలు కొనసాగుతున్నాయి. అలాగే, ఖమ్మం జిల్లాలోని వేంసూరు, కొణిజర్ల మండలాల్లోనూ ఫ్యాక్టరీల నిర్మానం జరుగుతోంది. ఉంది. అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు, ఖమ్మం ఉద్యాన డివిజన్లలో పంట సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 2019–20 వరకు 11,913 మంది రైతులు 48,296.19 ఎకరాల్లో పంట సాగు చేయగా.. 2025–26 సెప్టెంబర్ నాటికి 31,196 మంది రైతులు 1,22,351.34 ఎకరాల్లో పంట సాగు చేస్తుండడం విశేషం. తద్వారా ఐదేళ్ల కాలంలో ఆయిల్‌పామ్ సాగు 74 వేల ఎకరాలు పెరిగినట్లయింది.
సంవత్సరం ఖమ్మం భద్రాద్రి
రైతులు ఎకరాలు రైతులు ఎకరాలు
2019–20వరకు 1,897 8,232.67 10,016 40,063.5
2020–21 313 1,417.10 686 2,976.19
2021–22 700 3,009.03 1,013 4,237.50
2022–23 2,756 11,427.11 3,961 16,508.36
2023–24 1,255 4,605.025 2,402 8,953.00
2024–25 1,680 5,620.00 1,535 5,464.93
2025–26 1,858 6,034.40 1,124 3,802.50
మొత్తం 10459 40,345.34 20,737 82,006
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆయిల్‌పామ్ సాగు
సుదీర్ఘకాలం ఆదాయాన్ని ఇచ్చే పంట కావడం, జంతువులు, చీడపీడల సమస్య లేకపోవడంతో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలూ అందుతున్నాయి. ఇక్కడే ఫ్యాక్టరీలు ఉండడంతో సాగు పెరుగుతోంది. – ఎం.వీ.మధుసూదన్,
ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి
ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మొక్కలు, ఇతర పెట్టబడి కూడా అందిస్తోంది. ఇతర పంటల సాగుతో పోలిస్తే ఆయిల్ పామ్ మేలని గుర్తించా. భవిష్యత్‌లో మరింత డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం 15ఎకరాల్లో మొక్కలు నాటా.
–లక్కినేని శ్యాంమోహన్,
పెగళ్లపాడు, టేకులపల్లి మండలం

ఇంతింతై.. వనమంతై !

ఇంతింతై.. వనమంతై !