
అధికంగా వర్షపాతం, పంటలు..
సాధారణం కంటే 23.8 శాతం ఎక్కువ వర్షపాతం
వానాకాలంలో సాధారణం కంటే అధిక విస్తీర్ణంలో సాగు
మిర్చి సాగుకు విముఖత చూపిన
రైతులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో వానాకాలం సీజన్‌లో అధిక వర్షపాతం నమోదైంది. జూన్ మాసం నుంచి ఇప్పటివరకు 23.8 శాతం అధికవర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా సరాసరి సాధారణ వర్షపాతం 1,007 మి.మీ నమోదు కావాల్సి ఉండగా 1,246.4 మి.మీ వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో అధిక వర్షపాతం, 9 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
అధికవర్షపాతం నమోదైన మండలాలు
చర్ల, మణుగూరు, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, అశ్వారావుపేట మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, అశ్వాపురం, ఆళ్లపల్లి, బూర్గంపాడు, భద్రాచలం, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
అధిక విస్తీర్ణంలో పంటలు..
వానాకాలం సీజన్‌లో సాధారణ విస్తీర్ణం కంటే రైతులు అధికంగా పంటలు సాగు చేశారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,91,714 ఎకరాలు కాగా 6,13,702.43 ఎకరాల్లో సాగు చేశారు. అందనంగా 21,988 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వేరుశెనగ అంచనా కంటే తక్కువ సాగు కాగా కూరగాయలు, మిర్చి అతితక్కువగా సాగు చేస్తున్నారు. వరి, పత్తి, కంది, మొక్కజొన్న, ఆయిల్‌పామ్ పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి.