
గ్రూప్ వన్ పరీక్షల్లో గోల్‌మాల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పెరిగిందని, 2 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, గ్రూప్–1 పరీక్షల్లో గోల్‌మాల్ జరిగిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి విమర్శించారు. జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి, వైఎస్ హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకానికి, 108 సర్వీసులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్‌ను భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి కాకుండా వాయిదాల మంత్రిగా, వాటాల మంత్రిగా ఘనత సాధిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి 55 సార్లు ఢిల్లీ తిరగడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేశారని, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. తెలుగుదేశంలో ఉండి ఆ పార్టీని భూస్థాపితం చేసిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో తక్షణమే పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు సంకుబాపన అనుదీప్, తొగరు రాజశేఖర్, కర్నే మురళి, పూల రవీందర్, మునీర్, పోతురాజు రవి, భూపతి శ్రీను, జయరామ్, ఎల్. రమేష్, రిజ్వాన్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు
ఏనుగుల రాకేష్‌రెడ్డి