
బోటుగూడెంలో పోడు వివాదం
పినపాక: మండలంలో పోడు భూముల లొల్లి మళ్లీ మొదలైంది. బోటుగూడెం పంచాయతీ బందగిరినగరంలో పోడు భూముల వ్యవహారం అటవీ శాఖ అధికారులు, పోడు సాగుదారుల మధ్య వివాదంగా మారింది. అధికారులు పోడు భూముల చుట్టూ ట్రెంచ్ కొట్టడానికి సిద్ధమవుగా సాగుదారులు అడ్డుకున్నారు. 20 ఏళ్లుగా తాము భూములను సాగు చేసుకుంటున్నామని తెలిపారు. సీపీఎం కన్వీనర్ నిమ్మల వెంకన్న, కాంగ్రెస్ నాయకులు అక్కడకు చేరుకుని అధికారులతో మా ట్లాడారు. ప్రభుత్వం పోడు సాగుదారులకు అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. వివాదంపై ఫారెస్ట్ రేంజర్ తేజస్విని వివరణ కోరగా.. ఫారెస్ట్ పరిధిలో ఉన్న భూముల్లోనే ట్రెంచ్ కొడుతున్నామని, పట్టాలు పొందిన భూముల జోలికి తాము వెళ్లడంలేదని తెలిపారు.
పిడుగుపాటుకు గుడిసె దగ్ధం
ములకలపల్లి: పిడుగుపాటుకు గుడిసె దగ్ధమైన సంఘటన మూకమామిడి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన పుప్పాల ములకేశ్వర రావు, వేణి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం పనికి వెళ్లగా, సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో ఇంటిపై పిడుగు పడింది. దీంతో గుడిసె, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.