
ఏసీపీ విష్ణుమూర్తికి అంతిమ వీడ్కోలు
జూలూరుపాడు: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న సబ్బతి విష్ణుమూర్తి హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. స్వస్థలమైన జూలూరుపాడుకు ఆయన మృతదేహాన్ని మంగళవారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైరా, కొత్తగూడెం ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్‌రాజ్ ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. అలాగే, ఖమ్మం అదనపు డీసీపీ రామానుజం, ఇంటిలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రామోజీ రమేశ్, డీఎస్పీలు నాగన్న, అబ్దుల్ రెహమాన్, సీఐలు శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి, రిటైర్డ్ పోలీస్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు. అలాగే, వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు సైతం విష్ణుమూర్తి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. కాగా, విష్ణుమూర్తి అంత్యక్రియలను పోలీస్ లాంఛనాలతో నిర్వహించాలని వరంగల్ నార్త్ జోన్ డీఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే రాందాస్ తీసుకెళ్లారు. దీంతో ఆయన అంత్యక్రియలు అధికార లాంచనాలతో జరిగాయి.
నివాళులర్పించిన ఎస్పీ, ఎమ్మెల్యేలు