
పాలస్తీనాపై అమానవీయ యుద్ధం
ఇల్లెందు: అత్యంత చిన్నదేశమైన పాలస్తీనాపై అగ్రరాజ్యం అండతో ఇజ్రాయిల్ రెండేళ్లుగా యుద్ధం కొనసాగిస్తూ మహిళలు, చిన్న పిల్లలను అమానవీయంగా హతమారుస్తుండడం గర్హనీయమని వివిధ పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఇల్లెందులో మంగళవారం పాలస్తీనా సంఘీభావ సదస్సు జరగగా, ఎన్‌డీ రాష్ట్ర నాయకుడు గౌని ఐలయ్య మాట్లాడారు. ఇజ్రాయిల్ సాగిస్తున్న ఏకపక్ష దాడులతో అమాయక పాలస్తీనా పౌరులు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. కనీసం తాగునీరు, ఆహారం, మందులు కూడా ఇజ్రాయిల్ అందనివ్వడం లేనందున యుద్ధం నిలిపివేసేలా అన్ని దేశాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పౌరులంతా పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఎన్‌డీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు అధ్యక్షతన జరిగిన సదస్సులో మాస్‌లైన్, సీపీఎం, సీపీఐ, తదితర పార్టీల నాయకులు చండ్ర అరుణ, ఏఎస్ నబీ, డి.శంకర్, రాంసింగ్, ఎ.సాంబ, దొడ్డా డానియల్, సిలివేరు సత్యనారాయణ, టి.నాగేశ్వరరావు, నాయిని రాజు, బంధం నాగయ్య, కిరణ్, కృష్ణ, సత్యనారాయణ, జాఫర్, కె.సారంగపాణి, యాకూబ్‌షావలీ, కాంపాటి పృథ్వీ, బాస శ్రీనివాస్, గణేశ్, అభిమన్యు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావ సదస్సులో అఖిలపక్షం నేతలు