మణుగూరుటౌన్: ఆల్ ఇండియా ట్రెక్కింగ్ పోటీల్లో మణుగూరు సింగరేణి విద్యార్థులు ప్రతిభ చూపారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు హెచ్‌ఎం కల్యాణి ఎన్‌సీసీ ధ్రువపత్రాలను అందజేసి మాట్లాడారు. గత నెల 25 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుపతిలో ఎన్‌సీసీ 8వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 102 మంది పాల్గొన్నారని చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు సింగరేణి హైస్కూల్ నుంచి 8 మంది పాల్గొని ప్రతిభ చూపారన్నారు. శ్రీకృష్ణకౌషిక్ గ్రూప్ డ్యాన్స్‌లో బహుమతి సాధించాడని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల కోచ్, ఏఎన్‌ఓ కె.రాజసింహ, ఉపాధ్యాయుడు మస్తానయ్య ఉన్నారు.
పంట కాల్వల పరిశీలన
చండ్రుగొండ: సీతారామ ప్రాజెక్టు నుంచి పొలాలకు సాగునీరు అందించేందుకు నిర్మించనున్న కాల్వల నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం సర్వే అధికారులు మంగళవారం మండలంలో పలు భూములను పరిశీలించారు. మద్దుకూరు, దామరచర్ల, గుర్రాయిగూడెం, చండ్రుగొండ, రావికంపాడు, గానుగపాడు, పోకలగూడెం గ్రామాల్లో మొత్తం 19 కిలోమీటర్ల మేరకు కాల్వలు నిర్మించనున్నామని, 400 ఎకరాల భూమి అవసరముంటుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్వేయర్లు లక్ష్మణ్‌రావు, ప్రియాంక, జీపీఓ జగ్గయ్య, బొర్రా సురేశ్, మల్లం కృష్ణయ్య పాల్గొన్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అస్తిపంజరం
దుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు మామిడితోటలో ఇటీవల లభ్యమైన మానవ అస్తిపంజరాన్ని పోలీసులు మంగళవారం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ అస్తిపంజరం ములకపాడు గ్రామానికి చెందిన సిద్ధి రవికుమార్‌దిగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయినప్పటికీ శాసీ్త్రయ నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సీఐ వెంకటప్పయ్య తెలిపారు.
వరి పొలాలు పరిశీలించిన శాస్త్రవేత్తలు
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ):మండలంలోని రాజాపురం, నామవరం, ఊటుపల్లి గ్రామాల్లో వరి పొలాలను కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. సుమారు 200 ఎకరాల్లో వరిపంటలో బెరుకులు వచ్చాయని రైతులు ఇటీవలే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంటకు బ్యాక్టీరియల్ ఎండుతెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పంటపై ప్లాంటోమైసిన్ మందు పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు హేమంత్, భారత్, ఏఓ అనూష, ఏఈఓ సరిత, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా ఆర్‌సీఎం చర్చి స్వర్ణోత్సవం
ఇల్లెందు: పట్టణంలోని ఆర్‌సీఎం చర్చి (పరిశుద్ధ జపమాల మాత దేవాలయం)లో స్వర్ణోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. చర్చి 50 వసంతాల వేడుకలను చర్చి ఫాదర్ ఎ.సునీల్ జయప్రకాష్ ఆధ్వర్యాన నిర్వహించగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమానికి ఖమ్మం పీఠాధిపతి డాక్టర్ సగిలి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరవగా, అమృతరాజు, జయానంద్ తదితరులతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా ఆర్‌సీఎం చర్చి స్వర్ణోత్సవం

ఆల్ ఇండియా ట్రెక్కింగ్ పోటీల్లో ప్రతిభ