
బడి.. బహుదూరం..
ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరంతా వలస గొత్తికోయ చిన్నారులు.. అడవే వీరికి ఆవాసం. ఈ చిన్నారులు చదువుకోవాలంటే దూరంలో ఉన్న ఆశ్రమ పాఠశాల బాట పట్టాల్సిందే. అశ్వారావుపేట మండలంలోని మొద్దులమడ పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తయిన కొండపై ఉన్న పెద్దమిద్దె గ్రామంలో ఏళ్లుగా వలస గొత్తికోయలు నివాసం ఉంటున్నారు. ఈ గ్రామానికి వెళ్లేందుకు రహదారితోపాటు ప్రభుత్వ పాఠశాల కుడా లేదు. బడి ఈడు చిన్నారులు ఏటా చదువు కోసం సుమారు 50 కిలో మీటర్ల దూరంలోని కావడిగుండ్ల ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలకు రావాల్సిందే. దూరభారం కావడంతో సెలవులు వస్తే చిన్నారులు స్వగ్రామానికి వెళ్లి తిరిగి పాఠశాల తెరుచుకున్న తర్వాత రావడం లేదు. దీంతో ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు నరసింహారావు స్వయంగా పెద్దమిద్దె గ్రామానికి మొద్దులమడ నుంచి కాలినడకన వెళ్లి చిన్నారులను తిరిగి పాఠశాలకు తీసుకొస్తున్నారు. –అశ్వారావుపేటరూరల్