
జెడ్పీ పీఠాన్ని కై వసం చేసుకుంటాం..
ములకలపల్లి/పినపాక/మణుగూరురూరల్: రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అత్యధిక జెడ్పీటీసీ సీట్లు దక్కించుకుని జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవడమే కాక ఎంపీటీసీలు, సర్పంచ్ స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు. ములకలపల్లి, పినపాక మండలం ఈ–బయ్యారం, మణుగూరుల్లో మంగళవారం పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. జిల్లాలో సింగరేణి తదితర సంస్థల నుంచి రావాల్సిన డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులు రాబట్టడంలో విఫమలమయ్యారని తెలిపారు. ఇదే సమయాన ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీసేలా ఇంటింట అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కనీసం రైతులకు యూరియా అందించలేని విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. కాగా, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకుంటే బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం సులువవుతుందని కాంతారావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ–బయ్యారంలో జరిగిన సమావేశంలో దుగ్నేపల్లికి చెందిన 20 కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరాయి. సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, నాయకులు మోరంపూడి అప్పారావు, సతీశ్‌రెడ్డి, కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, ఎడ్ల శ్రీనివాస్, వట్టం రాంబాబు, అడపా అప్పారావు, యూసుఫ్ షరీఫ్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ప్రభుదాస్, అక్కి నర్సింహారావు, వేర్పుల సురేశ్, గువ్వా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు రేగా కాంతారావు