
సహజసిద్ధంగా వేడినీరు
ఇక్కడ భూమి నుంచి సహజసిద్ధంగా ఉబికి వస్తున్న వేడినీరు ఈ నీటి ఆధారంగా బీచ్.. పర్యాటకంగా అభివృద్ధికి ప్లాన్ సింగరేణి నుంచి సాంకేతిక, ఆర్థిక సహకారం
గోదావరి తీర ప్రాంతంలో చమురు నిక్షేపాల కోసం 70, 80వ దశకంలో ఆయిన్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) అన్వేషణ సాగించింది. ఈక్రమాన అనేక చోట్ల బోర్లు వేయగా మణుగూరు మండలం పగిడేరు వద్ద వేసిన ఓ బోరు నుంచి నిత్యం వేడి నీరు బయటకు వస్తోంది. ఆర్టిసన్ వెల్స్‌గా వీటిని పిలుస్తారు. భూమి లోపలి పొరల్లో ఉండే నీరు విపరీతమైన వేగంతో బండరాళ్ల గుండా ప్రవహించినప్పుడు ఏర్పడే రాపిడితో నీరు వేడెక్కుతుంది. పగిడేరు వద్ద ఉబికి వచ్చే నీరు 70 – 80 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఇక్కడ వేడినీటి ఊటల ఆధారంగా 20 కిలోవాట్ల సామర్ధ్యంతో జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఈ మేరకు రెండేళ్లుగా ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఉష్ణగుండాలు
హిమాలయ పర్వత శ్రేణుల్లో విస్తరించిన అనేక పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గర ఉష్ణగుండాలు ఇటు పర్యాటకులను, అటు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని మణికరణ్, ఉత్తర్‌ఖండ్‌లోని గౌరీకుండ్, తపోవన్ వంటి ప్రదేశాల్లో సహజసిద్ధంగా భూమిలో నుంచి వేడి నీరు బయటకు వస్తుంది. వీటిని పవిత్ర ప్రదేశాలుగా పరిగణిస్తూ అక్కడకు వెళ్లే భక్తులు స్నానాలు ఆచరిస్తారు. మెగ్నీషియం, సల్ఫర్, సోడియం, కాల్షియం వంటి ఖనిజాలను కలిగిన ఈ నీటిలో స్నానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తుల నమ్మిక. అలాగే, టైర్ వన్ సిటీల్లో కొత్తగా వెలుస్తున్న వెల్‌నెస్ సెంటర్లలోనూ ‘హాట్ వాటర్ థెరపీ’లు అందుబాటులో ఉన్నాయి.
కృత్రిమ బీచ్ ఏర్పాటుతో..
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని ప్రకటించింది. అందులో భాగంగానే తెలంగాణలో కృత్రిమ బీచ్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో ఆర్టిఫీషియల్ బీచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పుడు వేడి నీటి ఊటల ఆధారంగా పగిడేరులోనూ బీచ్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉబికి వచ్చే వేడి నీటిని సమీప ప్రాంత రైతులు నేరుగా ఉపయోగించడం లేదు. మడుల్లో నిల్వ చేసి చల్లారాక పొలాలకు పారిస్తున్నారు. ఇలాంటి మడుల దగ్గరే ఇసుక రాశులను భారీగా పోయడం ద్వారా కృత్రిమ బీచ్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.
సింగరేణి సహకారం
భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉండడంతో జిల్లాలో టెంపుల్ టూరిజం ఉన్నత స్థాయిలో ఉంది. ఏపీలోని పాపికొండలు, మారేడుమిల్లికి వెళ్లే పర్యాటకులు జిల్లా మీదుగానే రాకపోకలు సాగిస్తారు. ఇక పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద కూడా ఏకో టూరిజం అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఇలా జిల్లాకు వచ్చే పర్యాటకులకు మరో ఆకర్షణగా ఈ కృత్రిమ వేడి నీటి బీచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈమేరకు రెవెన్యూ సంబంధిత వ్యవహారాలు జిల్లా యంత్రాంగం చూసుకోనుండగా, ఇక్కడ జియో థర్మల్ పవర్ ప్లాంట్ పైలట్ ప్రాజెక్టు చేపడుతున్న సింగరేణి ఈ ప్రదేశాన్ని బీచ్‌గా మార్చేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం అందించనుంది. బొగ్గుతో మొదలైన సింగరేణి ప్రస్థానం థర్మల్, సోలార్ పవర్‌లోనూ తన సత్తా చాటుతోంది. తాజాగా రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్‌తో పాటు పర్యాటక రంగంలోనూ పాదం మోపనుంది. ఇప్పుడు కృత్రిమ బీచ్ ఏర్పాటు ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే సింగరేణి మరో అడుగు ముందుకేసినట్లవుతుంది.
పగిడేరులో కృత్రిమ బీచ్ ఏర్పాటుకు సన్నాహాలు