రామయ్య చెంత రైలు కూత! | - | Sakshi
Sakshi News home page

రామయ్య చెంత రైలు కూత!

Sep 27 2025 5:15 AM | Updated on Sep 27 2025 5:15 AM

రామయ్య చెంత రైలు కూత!

రామయ్య చెంత రైలు కూత!

● భద్రగిరి–మల్కాన్‌గిరి రైల్వే లైన్‌లో మార్పులు జరిగే అవకాశం ● ధ్రువీకరించాల్సిన రైల్వే శాఖ అధికారులు

రాజుపేటలో భద్రాచలం రైల్వే స్టేషన్‌!
● భద్రగిరి–మల్కాన్‌గిరి రైల్వే లైన్‌లో మార్పులు జరిగే అవకాశం ● ధ్రువీకరించాల్సిన రైల్వే శాఖ అధికారులు

అన్ని అనుకూలిస్తే భద్రగిరివాసుల దశాబ్దాల కల వాస్తవరూపం దాల్చనుంది. రైల్వే శాఖ చిత్రపటంలో భద్రాచలం పేరు కనిపించనుంది. భద్రాచలం–మల్కాన్‌గిరి రైల్వే లైన్‌ ఏర్పాటుతో రామ భక్తుల ముచ్చట కూడా తీరనుంది. గోదావరికి ఇరువైపులా ప్రతిపాదించిన రైల్వే స్టేషన్ల సర్వేలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటువైపు సారపాకలో, అటువైపు తాజాగా భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న రాజుపేటలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుండగా, రైల్వే అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులతో ఇమిడి ఉన్న రాజుపేటలో ఏ ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ రానుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

–భద్రాచలం

భద్రాచలం స్టేషనే కీలకం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో రవాణా, ప్రయాణికుల కోసం మల్కాన్‌గిరి–భద్రాచలం రైల్వే లైన్‌ ప్రతిపాదించారు. రైల్వే మార్గంలో అనేక గిరిజన గ్రామాలు అనుసంధానించనున్నారు. ఇందుకోసం సుమారు 173 కిలోమీటర్ల మేర లైన్‌, పలు చోట్ల భారీ వంతెనలు, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించారు. ఒడిశాలోని జేపూర్‌ వరకు, అక్కడి నుంచి మల్కాన్‌గిరి వయా భద్రాచలం వరకు ఈ లైన్‌ ఉంటుందని గతంలో అధికారులు పేర్కొన్నారు. భద్రాచలం నుంచి పాండురంగాపురం రైల్వే స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ సారపాకలో రైల్వే స్టేషన్‌కు ప్రతిపాదించారు. నిర్మాణానికి తొలుత సుమారు రూ. 2,800 కోట్లు, ఆ తర్వాత రూ.3,592 కోట్లు వ్యయకానుందని అంచనా వేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఈ రైల్వే లైన్‌ వస్తే భద్రాచలానికి దేశ వ్యాప్తంగా రైల్వే రవాణా భక్తులకు అందుబాటులో రానుంది.

రామాలయానికి కూతవేటు దూరంలో..

గతంలో ఒడిశాలోని మల్కాన్‌ గిరి, బదలి, కోవాసి గూడ, రాజన్‌గూడ, మహారాజ్‌ పల్లి, లూనిమన్‌గూడ స్టేషన్‌లు, ఆంధ్రప్రదేశ్‌లోని కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామల గుండా భద్రాచలంలో ప్రవేశించేట్లు రైల్వే లైన్‌ పనులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్‌ భద్రాచలానికి సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఏపీలోని యటపాక, పిచుకలపాడు తదితర గ్రామాల వద్ద ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగింది. తాజాగా స్టేషన్‌ భద్రాచలం పరిధిలో ఉన్న రాజుపేటలోకి మారినట్లు సమాచారం. ఏపీలోని చింతూరు మండలం కుయుగూరు, కూనవరం మండలంలోని సీతారామపురం, భీమవరంలో రైల్వే స్టేషన్ల ప్రతిపాదన కూడా వచ్చింది. భద్రాచలం శివారు రాజుపేట గ్రామంలో రైల్వే స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి కూత వేటు దూరంలో రైల్వే స్టేషన్‌ రానుండటంతో భక్తులు, భద్రాచలం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో ఉమ్మడిగా రాజుపేట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజుపేట భద్రాచలం శివారు ప్రాంతంగా ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం గ్రామం రెండు ముక్కలయింది. రెండు రాష్ట్రాల సరిహద్దుగా మారింది. ఇక్కటి ప్రజలకు తెలంగాణలో ఇళ్లు, ఏపీలో పొలాలు ఉన్నాయి. రాజుపేటలో రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణలోనా, అటు ఆంధ్రప్రదేశ్‌లోనా అనే సస్పెన్స్‌ నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఖాళీ స్థలాలు అత్యధికంగా ఏపీలోనే ఉన్నాయి. దీంతో దాదాపు ఏపీలోని రాజుపేటలోనే నెలకొనే అవకాశం ఉంది. ఈ విలీన గ్రామపంచాయతీ ప్రజలు ఎన్నో రోజుల నుంచి తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చితే రైల్వే స్టేషన్‌ను ఏ రాజుపేటలో ఏర్పాటు చేసినా తెలంగాణ పేరు మీదుగానే చరిత్రలో నిలిచే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement