
అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు
ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు
కొత్తగూడెంటౌన్: అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఎనిమిది రోజులపాటు ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చింది. కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, తల్లులకు రోజూ అందిస్తున్న మెనూ, పోషకాహారంలను టేక్ హోంతో ఇళ్లకు అందజేస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. అంగన్‌వాడీలకు మొదటిసారిగా సెలవులను ఇవ్వడంతో టీచర్‌లు, ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లు అంగన్‌వాడీ సిబ్బందికి సెలవులు ఇచ్చామని, జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా తెలిపారు.
భూసేకరణకు సర్వే
జూలూరుపాడు: సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం కోసం శుక్రవారం గుండెపుడి, రామచంద్రాపురం గ్రామాల్లో భూసేకరణ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈఈ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 16 ఆర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ప్యాకేజీ–2 కింద భూసేకరణకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని చెరువులకు, సీతారామ ప్రధాన కాలువను సంధానం చేసేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జూలూరుపాడు సొసైటీ చైర్మన్ కొమ్మినేని పాండురంగారావు, కాళ్లూరు ప్రవీణ్ కుమార్, ఆనగంటి ధనమయ్య, రైతులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలు
పారదర్శకంగా నిర్వహించాలి
చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పారదర్శకంగా పోలింగ్ జరిగేందుకు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన, జిల్లా ఉపాధికల్పానాధికారి శ్రీరామ్, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం ఐడీఓసీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్టేజ్ –1 రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. 180 మందికి శిక్షణ నిర్వహించారు. గ్రామ పంచాయతీల ఎన్నికల విధులకు హాజరయ్యే ఆర్వోలు, ఏఆర్వోలకు కొత్తగూడెం క్లబ్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 742 మందికి అవగాహన కల్పించారు. డీల్‌పీఓలు ప్రభాకర్, సుధీర్, ఏఓ రమణ, పుల్లయ్య పర్యవేక్షించారు.
వంద శాతం పీఎల్‌ఎఫ్ సాధించాలి
పాల్వంచ: విద్యుదుత్పత్తిలో వంద శాతం పీఎల్‌ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించేలా కృషి చేయాలని జెన్ కో (థర్మల్) వై.రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 7వ దశ కర్మాగారాన్ని ఆయన ఎఫ్‌ఏ సీసీఎం (అకౌంట్స్) జి.సత్తిరాజుతో కలిసి సందర్శించారు. యాష్ పాండ్, యాష్ ప్లాంట్, సైలోస్‌లలో పర్యటించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. నాణ్యతతో కూడిన విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా, విధుల్లో క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. మెయింటెనెన్స్ సక్రమంగా ఉంటేనే ఉత్పత్తిలో అంతరాయాలు నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో జనరేషన్ సీఈ రత్నాకర్, 7వ దశ సీఈ శ్రీనివాసబాబు, ఎస్‌ఈలు రాజ్‌కుమార్, కె.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
‘ప్రభాత సుమాలు’
గ్రంథానికి గుర్తింపు
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటకు చెందిన సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రచించిన పరిశోధనా గ్రంథం ప్రభాత సుమాలుకు అంతర్జాతీయ ప్రామాణికత గ్రంథ గుర్తింపు లభించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని రాజారామమోహన్‌రాయ్ ఐఎస్‌బిఎన్ ఏజెన్సీ నుంచి అధికారికంగా లేఖ వచ్చినట్లు రచయిత తెలిపారు. కాగా, ఈ గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం ఆర్థిక సహకారంతో ముద్రించి నవంబర్‌లోపు పాఠకులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు