
పిల్లాపాపలతో రేయింబవళ్లు దీక్ష
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సంఘీభావం
ధర్నాచౌక్‌లో ఐదురోజులుగా ఆందోళన చేస్తున్న ఆదివాసీలు
దోమలతో జ్వరాల బారిన పడుతున్న అడవి బిడ్డలు
కలెక్టరేట్‌లో నుంచి కన్నెత్తి చూడని అధికారులు
మాకు హక్కు కల్పించాలి
ఇక్కడి నుంచి కదలం
అధికారుల తీరు దారుణం
భూమి చూపిస్తామని చెప్పాం
సూపర్‌బజార్(కొత్తగూడెం): మా భూమి మాకు అప్పగించాలని ఆదివాసీలు రేయింబవళ్లు దీక్షలు చేపడుతున్నారు. చెట్ల పొదలతో నిండి ఉన్న కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఐదు రోజులుగా అక్కడే దీక్ష చేపడుతున్నా.. జిల్లా ఉన్నతాధికారులంతా కలెక్టరేట్‌లోనే ఉంటున్నా అడవి బిడ్డల గోస ఎవరికీ పట్టడంలేదు. 250 మంది ఆదివాసీలు చిన్న పిల్లలతో విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం లేకపోయినా ఆందోళన కొనసాగిస్తున్నారు. ధర్నాచౌక్‌లో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం, చెట్ల పొదలతో నిండి ఉండటంతో దోమలు, ఇతర కీటకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల కారణంగా కొందరు వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఇలాగే దీక్ష కొనసాగితే చాలామంది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. చిన్న పిల్లలతో కూడా ఉండటంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వారు పడుతున్న అవస్థలు చెప్పనలవి కాదు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆందోళన వైపు దృష్టిసారించలేదు. అన్ని పార్టీలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపి తమ భూసమస్యను పరిష్కరించాలని ఆదివాసీలు కోరుతున్నారు. రామన్నగూడెంలో 150 మంది ఆదివాసీ రైతులకు సంబంధించిన 573.20 ఎకరాల భూమి విషయంలో అటవీ, ఎఫ్‌డీసీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నెలకొంది. భూములకు ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇచ్చిందని, హైకోర్టు సైతం తమకు అనుకూలంగా 2011లో తీర్పు చెప్పిందని, అయినా భూమి మాత్రం తమకు దక్కలేదని ఆదివాసీలు ఆవేదన చెందుతున్నారు.
దీక్షలకు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య దీక్షా శిబిరాన్ని సీపీఐ మాస్ లైన్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రవి మాదిగ తదితరులు దీక్షలను సందర్శించి మద్దతు తెలిపారు.
మా భూములపై హక్కు కల్పించాలి. తాత ముతాత్తల కాలం నుంచి పోరాటం జరుగుతోంది. మాకు పట్టాలు ఉన్నాయి. 573 ఎకరాల్లో 104 ఎకరాలు మాత్రమే మా ఆధీనంలో ఉన్నాయి. 180 మంది ఆదివాసీ రైతుల గోడును అధికారులు పట్టించుకోవాలి. –మడకం నాగేశ్వరరావు,
ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి
ఎన్ని కష్టాలు ఎదురైనా మా భూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదలం. మాకు భూమిపై హక్కు కల్పించాలి. రెవెన్యూ, అటవీశాఖలు సమన్వయంతో మా సమస్యను పరిష్కరించాలి.
–ముడియం రమాదేవి
పిల్లా పాపలతో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే అధికారులు స్పందించక పోవడం దారుణం. గత నెల 9న కొత్తగూడెం ఆర్డీఓ వచ్చి పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. – కొర్స శ్రీను
సమస్య పరిష్కారానికి గతంలో రామన్నగూడెం వెళ్లాం. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నవారికి భూమిని చూపిస్తామని చెప్పాం. కానీ రెవెన్యూ పరిధిలో ఉన్న భూమి కాకుండా అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూమి విసయంలో సమస్య ఉంది.
–మధు, కొత్తగూడెం ఆర్డీఓ

పిల్లాపాపలతో రేయింబవళ్లు దీక్ష

పిల్లాపాపలతో రేయింబవళ్లు దీక్ష

పిల్లాపాపలతో రేయింబవళ్లు దీక్ష

పిల్లాపాపలతో రేయింబవళ్లు దీక్ష

పిల్లాపాపలతో రేయింబవళ్లు దీక్ష