
విద్య, ధన ప్రాప్తిరస్తు
● వైభవంగా సాగుతున్న నవరాత్రి ఉత్సవాలు ● నేడు ధాన్యలక్ష్మి అలంకరణలో అమ్మవారు
భద్రాచలం: విద్యాధనం, హిరణ్య ధనం, శక్తి ధనంలను ప్రసాదించే ధనలక్ష్మిగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చి అభయమిచ్చారు. భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు. లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన జరిపారు. చిత్రకూట మండపంలో వేద పండితులు, అర్చకులు అరణ్య కాండ పారాయణం చేశారు.
ధాన్యలక్ష్మి అలంకార విశిష్టత
అమ్మవారిని శనివారం ధాన్యలక్ష్మిగా అలంకరించనున్నారు. అన్ని రకాల ధాన్యాన్ని ప్రసాదించేది అమ్మవారేనని, అమ్మవారిని ఆరాధిస్తే ఈతి బాధలన్నీ తొలగి, సమయానికి తగిన వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు.
కనుల పండువగా కల్యాణం
స్వామివారికి బేడా మండపంలో నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
అలరించిన నృత్య ప్రదర్శన
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారంనిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మైత్రి ఫైన్ ఆర్ట్స్ మద్రాస్ ఆధ్వర్యంలో సరళ కుమారి నేతృత్వంలో చిత్రకూట మండపంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ నిత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్నారుల నృత్యం చూపరులను మంత్రముగ్ధులను చేసింది.