
‘జల్ సంచయ్’లో ప్రత్యేక గుర్తింపు
జిల్లాకు రూ. 25 లక్షల నగదు బహుమతి
చుంచుపల్లి: దేశవ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడంతోపాటు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రావడం గర్వకారణమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 కార్యక్రమంలో జిల్లాకు రూ.25 లక్షల నగదు బహుమతి లభించిందన్నారు. జిల్లాలో 32,000 నిర్మాణాలు చేపట్టి 29,103 నీటి సంరక్షణ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఇంకుడు గుంతలు, నీటికుంటలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, ఊట చెరువులు వంటి వర్షపు నీటి సంరక్షణ పనులు పట్టణ ప్రాంతాలకు కూడా ఉపయుక్తంగా మారాయని పేర్కొన్నారు. ప్రజల సహకారం, స్థానిక సంస్థల భాగస్వామ్యం, గ్రామీణ అభివృద్ధి సంస్థల కృషితో ఈ విజయాన్ని సాధించగలిగామని అన్నారు.