భద్రాచలంటౌన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు బాలుడు మింగిన స్టార్ డ్రిల్ బిట్‌ను శస్త్రచికిత్స ద్వారా బుధవారం విజయవంతంగా తొలగించారు. సరిహద్దు ఏపీలోని ఎటపాక మండలం చోడవరం గ్రామానికి చెందిన 8 ఏళ్ల గౌతమ్ ఆడుకుంటూ 6 అంగులాల డ్రిలింగ్ మిషన్‌కు సంబంధించిన స్టార్ డ్రిల్ బిట్‌ను గత శనివారం మింగాడు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం తల్లికి చెప్పాడు. దీంతో కుంటుంబ సభ్యులు ఏరియా వైద్య శాలకు తరలించగా పిల్లల వైద్యుడు రాజశేఖర్‌రెడ్డి పరీక్షించి విసర్జన ద్వారా బయటకు వస్తుందేమోనని రెండు రోజులు వేచిచూశారు. ఈ క్రమంలో బాలుడికి బాగా కడుపులో నొప్పి వస్తుండడంతో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం శస్త్ర చికిత్స నిర్వహించి డ్రిల్ బిట్‌ను తొలగించారు. బాలుడికి శస్త్ర చికిత్స చేసిన వారిలో అనస్థీషియన్, నిఖిత, మల్లేశ్‌దొర పాల్గొన్నారు.
కడుపులోని డ్రిల్ బిట్ తొలగింపు