
ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై చొరవ తీసుకోండి
కేంద్ర మంత్రికి తుమ్మల వినతి
ఇల్లెందు/ఖమ్మంఅర్బన్: కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రాంమోహన్‌నాయుడుకు వివరాలు అందజేసి మాట్లాడారు. గతంలో గుర్తించిన స్థలం అనుకూలంగా లేదని తేల్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన నేపథ్యాన సర్వే చేయించాలని కోరారు. జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులే కాక సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పరిశ్రమలకు వచ్చివెళ్లే అధికారులకు అనువుగా ఉంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామిని కూడా కలిసిన తుమ్మల.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ఆవశ్యకతను వివరించారు.
కలెక్టరేట్‌లో నేడు
ప్రజాపాలన దినోత్సవం
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవివిష్కరించనున్నారు. ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. వివిధ అభివృద్ధి పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం 11.30 గంటలకు ములకలపల్లి మండలం మంగపేటలో నిర్వహించే జిల్లా స్థాయి ఆరోగ్య శిబిరంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు దమ్మపేట మండలం గండుగులపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు.
రైతులు కూపన్లు తీసుకోవాలి
ములకలపల్లి: పీఏసీఎస్‌లో యూరియా కోనుగోలు చేసే రైతులు.. ఏఈఓలు జారీ చేసే కూపన్లు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి. బాబూరావు సూచించారు. మండలంలోని పూసుగూడెం రైతువేదికలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఆధార్‌కార్డు, పట్టా పాస్ పుస్తకాలు వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సొసైటీలతో పాటు రైతు వేదికల్లోనూ యూరి యా విక్రయిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇల్లెందు ఏడీఓ జి.లాల్‌చందర్, ఎంఏఓ అరుణ్‌బాబు, ఏఈఓ రజనీకాంత్, పీఏసీఎస్ సిబ్బంది మురళీ, నాగేంద్ర పాల్గొన్నారు.
లైసెన్స్ హక్కులకు 29న వేలం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్ధానంలో వివిధ లైసెన్స్‌ల హక్కు మంజూరుకు ఈనెల 29న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ కె.దామోదర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు తానీషా కల్యాణ మండపంలోని కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని సూచించారు. గతంలో దేవస్థానానికి బాకీ, తగాదాలు ఉన్నవారు అనర్హులని పేర్కొన్నారు. వివరాలకు కార్యాలయ పనివేళల్లో 9515545354 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
నేడు ఖమ్మంలో సాయుధ పోరాట వారోత్సవాల సభ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో బుధవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. గత వారం రోజులుగా అమరువీరులకు నివాళులర్పించడమేకాక సభను విజయవంతమయ్యేలా ప్రచారం చేశామని వెల్లడించారు. ఈమేరకు బుధవారం జరిగే సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబి, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్‌రావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.