
సృజనాత్మక బోధన అందించాలి
టీఎల్‌ఎం మేళాలో పీఓ రాహుల్
భద్రాచలం: విద్యార్థులకు సృజనాత్మక బోధన అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్‌లో ఏర్పాటుచేసిన టీఎల్‌ఎం మేళాను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు వివిధ అంశాలను సులువుగా నేర్చుకునేందుకు ఈ ప్రక్రియ ఉపకరిస్తుందన్నారు. ఉద్దీపకం వర్క్‌బుక్–2 లోని సారాంశాలను సృజనాత్మక చిత్రాల ద్వారా అవగాహన కల్పించేందుకే ఈ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే భద్రాచలం, దమ్మపేట, ఇల్లెందు డివిజన్ల పరిధిలో ఈ మేళాలను నిర్వహించామని వెల్లడించారు. జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాలో తెలుగు, గణితం, ఇంగ్లిష్ విభాగాల్లో ఉత్తమంగా ఎంపికై న పాఠశాలల ఉపాధ్యాయులకు నగదు బహుమతులు అందిస్తామని వివరించారు. ప్రథమ బహుమతిగా రూ. 5,000, రెండో బహుమతి రూ. 3,000, మూడో బహుమతి రూ.2,000తో పాటు మెమెంటోలు అందిస్తామని తెలిపారు.
స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి..
నిరుద్యోగ గిరిజన యువత స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని రాహుల్ అన్నారు. వైటీసీలో జరుగుతున్న వీడియో, ఫొటోగ్రఫీ శిక్షణను పరిశీలించిన పీఓ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం, ఐటీడీఏ అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మాతృభాషపై పట్టు సాధించాలి..
భద్రాచలంటౌన్ : పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపునకు పలు రకాల పోటీలు నిర్వహించాలని, తద్వారా మాతృభాషపై మరింత విజ్ఞానం, పట్టు కలుగుతాయని పీఓ బి.రాహుల్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్థానిక గిరిజన భవన్‌లో నిర్వహించిన వివిధ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి పోటీలతో పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందన్నారు. అనంతరం వివిధ అంశాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, జేడీఎం హరికృష్ణ, ఆర్సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల ఉద్యోగులు రమేష్, రాములు, అశోక్‌కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, నారాయణరెడ్డి, కృష్ణార్జున, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.