‘స్వచ్ఛత’కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛత’కు సర్వం సిద్ధం

Sep 17 2025 9:06 AM | Updated on Sep 17 2025 9:06 AM

‘స్వచ

‘స్వచ్ఛత’కు సర్వం సిద్ధం

రోజూవారీ ప్రణాళికలతో ముందుకు

నేటి నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు

జిల్లాలోని 471 పంచాయతీల్లో నిర్వహణ

పల్లెలను వేధిస్తున్న నిధుల కొరత

పనులు సజావుగా సాగేనా..?

చుంచుపల్లి: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని చెప్పిన మాహాత్మాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ప్రతి పంచాయతీలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్వాన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను బుధవారం నుంచి అక్టోబర్‌ 2 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేయగా.. స్వచ్ఛోత్సవ్‌ – పక్షోత్సవాల పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలోని 471 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేస్తారు. ఇందుకోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు పాల్గొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రధానంగా పరిసరాల పరిశుభ్రతపై మానవహారాలు, స్వచ్ఛత పరుగు, ర్యాలీలు చేపట్టనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బహిరంగ స్థలాలు, కూడళ్లలో ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, శ్రమదానాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం వంటివి జరిపిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు.

ప్రధాన కార్యక్రమాల వివరాలిలా..

● పల్లెల్లో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధాన కూడళ్లు, ప్రజోపయోగ స్థలాలు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చెత్త, మురుగు తొలగిస్తారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజల శ్రమదానంతో పారిశుద్ధ్య పనులు చేపడతారు.

● కంపోస్ట్‌ షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేయడం, చెత్త నుంచి ప్లాస్టిక్‌, గాజు, ఇతర వస్తువులు తొలగించి మిగిలిన తడిచెత్త వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మారుస్తారు.

● అక్టోబర్‌ 2న చివరి రోజు గ్రామసభల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేలా ప్రత్యేక తీర్మానాలు చేస్తారు. వస్త్ర సంచులు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. స్వచ్ఛత ప్రాధాన్యంపై విద్యాలయాల్లో క్విజ్‌ పోటీలు, విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేలా చర్యలు చేపడతారు.

నిధుల సంగతేంటి..?

‘స్వచ్ఛతా హీ సేవ’ పేరుతో బుధవారం నుంచి వచ్చే నెల 2 వరకు 15 రోజులపాటు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గ్రామ కార్యదర్శులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రతి పనికీ కార్యదర్శులే పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలకు నిధుల లేమితో అడ్డంకులు ఏర్పడతాయనే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. రోజువారీ ప్రణాళికలతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్ఛ పల్లెలుగా మార్చడమే లక్ష్యం. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం.

– ఎం. విద్యాచందన, డీఆర్‌డీఓ

‘స్వచ్ఛత’కు సర్వం సిద్ధం1
1/1

‘స్వచ్ఛత’కు సర్వం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement