● బాధితులపై మూత్రం పోసిన వైనం ● దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: చేతబడి, క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన వారు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన పాయం వెంకటేశ్వరరావు, మడకం రంగయ్య, డేరంగుల దయాకర్‌తోపాటు మరో మహిళ కలిసి గ్రామ శివారులోని వంతెన వద్ద పసుపు, కుంకుమతో పూజలు చేసి చేతబడి చేస్తున్నట్లు అనుమానంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి శుక్రవారం రాత్రి దాడికి పాల్పడ్డాడు. కాగా, గ్రామస్తులు రావడాన్ని గమనించిన మహిళ అక్కడి నుంచి పారిపోగా, పాయం వెంకటేశ్వరరావు, మడకం రంగయ్య, దయాకర్‌పై దాడికి పాల్పడ్డారు. బాధితులపై మూత్రం పోసి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దాడిలో వెంకటేశ్వరరావు చేయి విరిగిపోగా, రంగయ్య, దయాకర్‌లు స్వల్పంగా గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితులు సోమవారం పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, మిగిలినవారి వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్సై అఖిల తెలిపారు.